ఇప్పట్లో పార్టీ మారే ప్రసక్తే లేదు

ఇప్పట్లో పార్టీ మారే ప్రసక్తే లేదు

మునుగోడు, వెలుగు: తాను కాంగ్రెస్ పార్టీని వీడి మరొక పార్టీలో చేరతానని వస్తున్న వార్తలు అవాస్తవమని, తాను ఇప్పట్లో పార్టీ మారే ప్రసక్తే లేదని, ఒకవేళ మారాల్సి వస్తే టీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా ఉన్న పార్టీలో చేరతానని మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.  ఆదివారం మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వేరే పార్టీలో చేరేముందు మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త, నాయకుడికి చెప్పి ఒప్పించుకొనే చేరతానన్నారు. వచ్చే ఎన్నికల్లో అప్పటి పరిస్థితులని బట్టి మునుగోడు ఎమ్మెల్యే లేదా భువనగిరి ఎంపీగా పోటీచేస్తానని స్పష్టం చేశారు.  

సూర్యపేటలో గెలవడని తెలిసే మునుగోడుకు.. 

ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రొటోకాల్​ పాటించడం లేదని రాజగోపాల్​రెడ్డి అన్నారు. తన ప్రమేయం లేకుండా మంత్రి నియోజకవర్గంలో పర్యటిస్తూ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం సిగ్గుచేటన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు పంపిణీ చేసే చెక్కుల ను ఇచ్చేందుకు మంత్రి గ్రామాలకు వస్తే తరమికొడుతామన్నారు. సూర్యాపేటలో గెలవలేనని తెలిసే మంత్రి జగదీశ్​రెడ్డి మునుగోడులో తిరుగుతున్నాడని, కానీ ఆయనని మునుగోడు ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. గ్రామాల అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు మంత్రి నిధులు మంజూరు చేస్తే తానే దగ్గరుండి ఆయనను సన్మానిస్తానన్నారు. శిలాఫలకంపై తన పేరు లేకపోయినా పనులని ప్రారంభిస్తానని చెప్పారు. చౌటుప్పల్ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్​రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీలు అనంత రాజుగౌడ్, బుజ్జి, నన్నూరి విష్ణువర్ధన్​రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్​రెడ్డి పాల్గొన్నారు.