హైదరాబాద్, వెలుగు: పాతబస్తీలో మూడేళ్ల క్రితం జరిగిన హత్య కేసును సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేధించారు. బావను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అదనపు డీసీపీ,టాస్క్ ఫోర్స్ చైతన్యకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తాగుడుకు బానిసైన షేక్ వహీద్
తాండూర్ ఇందిరానగర్ కు చెందిన షేక్ వహీద్(28) వెల్డర్ గా పనిచేసేవాడు. 2007 లో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సుల్తాన బేగంను పెండ్లి చేసుకున్నాడు. వహీద్, సుల్తాన బేగం దంపతులకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య పిల్లలతో చాంద్రయాణగుట్టలో వెల్డింగ్ పనిచేస్తూ వహీద్ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసై ప్రతీరోజు భార్య సుల్తాన బేగంతో గొడవపడుతూ సంపాదించిన డబ్బును మద్యం తాగేందుకు ఖర్చు చేయడంతో భార్యా పిల్లలకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఇదే విషయంలో అనేక సార్లు సుల్తాన కుటుంబ సభ్యులతో గొడవలు జరిగాయి. సుల్తాన సోదరుడు అబ్దుల్ ఖవీ(33) తన సోదరి భర్త షేక్ సాలమ్ తో మహీద్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వహీద్ లో మారకపోవడంతో ఇద్దరూ కలిసి వహీద్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు.
సోదరికి తెలియకుండానే హత్య
తాగుడుకు బానిసైన వహీద్ ఇంటి నుంచి బయటకు వెళ్లి కొన్ని రోజుల తరువాత తిరిగివచ్చేవాడు. ఇదే అదునుగా అబ్దుల్ ఖవీ, సాలమ్ కలిసి షేక్ వహీద్ ను హతమార్చేందుకు స్కెచ్ వేశారు. 2016 ఆగస్టు 12న ప్లాన్ చేశారు. ఆ రోజు రాత్రి వహీద్ ను కలిసి మద్యం తాగేందుకు తమతో తీసుకెళ్లారు. ఐతే అప్పటికే మద్యం మత్తులో ఉన్న వహీద్ ను ఆటోలో పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లికి తీసుకెళ్లారు. మామిడిపల్లి శివారు ప్రాంతంలో వహీద్ తలపై కొట్టి హత్య చేశారు. ఆ తరువాత ఆనవాళ్లు దొర్కకుండా డెడ్ బాడీని పెట్రోల్ పోసి తగులబెట్టారు. డెడ్ బాడీ వద్ద ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డారు. బాద వహీద్ ను హత్య చేసినట్లు అబ్దుల్ ఖవీ తన సోదరి సుల్తాన కూడా చెప్పలేదు.
2016 ఆగస్ట్ 12న హత్య
2016 ఆగస్ట్ 13న పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ లో గుర్తుతెలియని వ్యక్తి హత్య కింది పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో అన్ డిటెక్టెడ్ కేసు కింద వహీద్ మర్డర్ కేసు పెండింగ్ లో పెట్టారు. ఇలా గత మూడేళ్లుగా మిస్టరీగా మారిన వహీద్ హత్యను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేధించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్, కె.మధుమోహన్ రెడ్డి టీమ్ వహీద్ కేసును పరిశీలించింది. ఈ కేసులో మృతుడి బంధువులు ఇచ్చిన సమాచారంతో వహీద్ బావమరిది అబ్దుల్ ఖవీని టాస్క్ ఫోర్స్ టీమ్ విచారించింది.
ఇలా చేధించారు
కనిపించకుండా పోయిన వహీద్ కోసం భార్య సుల్తాన కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. తమకందిన విశ్వసనీయ సమాచారంతో వహీద్ బావమరిది అబ్ధుల్ ఖవీని అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారు. దీంతో హత్యకు గల కారణాలు వహీద్ ను హత్య చేసిన విధానాన్ని ఖవీ పోలీసులకు తెలిపాడు. వహీద్ ను హత్య చేసిన ఖవీతో పాటు సాలమ్ ను అరెస్ట్ చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో సాక్ష్యాధారాలను సేకరించారు. దీంతో గుర్తుతెలియని హత్యగా పెండింగ్ లో వహీద్ మర్డర్ కేస్ ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేధించారు. ఇలాంటిదే గత 18 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసును సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేధించింది.
