ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సంచలనం సృష్టించిన 17 ఏండ్ల సూర్య ప్రతాప్ చౌహాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అసద్ శనివారం అర్ధరాత్రి జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. బక్రీద్ రోజున సూర్య ప్రతాప్ చౌహాన్‌ను విందుకు పిలిచిన అసద్.. అనుచరులతో కలిసి అతడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వందలాది మంది రోడ్లమీదికివచ్చి నిరసనలు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది జరిగిన రెండ్రోజుల్లోనే ప్రధాన నిందితుడు అసద్ పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు.
అసలేం జరిగిందంటే..
అసద్‌తో పాటు మిగతా నిందితులంతా సూర్యప్రతాప్ స్నేహితులే. మే 28 బక్రీద్ రోజున ఘజియాబాద్‌లోని ఖోడా ప్రాంతంలో బైక్ నడపడం విషయంలో సూర్య ప్రతాప్‌కు అసద్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అసద్, అతని సహచరులు.. సూర్యపై కత్తులతో దాడి చేశారని పోలీసులు చెప్తున్నారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ సూర్యప్రతాప్ అదే రోజు కన్నుమూశాడు.
అయితే, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం అసద్ కావాలనే సూర్యప్రతాప్‌ను చంపేశాడని ఆరోపిస్తున్నారు. మే 28న బక్రీద్ రోజున విందుకు రమ్మని పిలిచి ఏడుగురు కలిసి సూర్యను కత్తులతో పొడిచి ప్రాణాలు తీశారని చెప్తున్నారు. కత్తిపోట్లకు బలై పారిపోతున్నా వదలకుండా సూర్యను పొట్టనపెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. బక్రీద్ రోజే సూర్య కన్నుమూయడంతో స్థానిక హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. దీంతో పోలీసులు మొత్తం నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అసద్ కోసం గాలింపు చేపట్టారు.
నిందితుడు పారిపోతుండగా కాల్పులు..
తన అనుచరుల నుంచి డబ్బు తీస్కుని అసద్ వేరే రాష్ట్రానికి పారిపోతున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఖోడా ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అసద్ ఓ వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తుండగా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అతడు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిని అసద్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు ప్రకటించారు. ఎన్‌కౌంటర్ సమయంలో ఓ పోలీసు అధికారికి కూడా బులెట్ తగిలిందని, ఆయన ప్రస్తుతం ట్రీట్‌మెంట్ పొందుతున్నాడని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఎన్‌కౌంటర్‌పై సూర్యప్రతాప్ తల్లి స్పందిస్తూ, తన కొడుకును చంపిన నిందితులందరిపైనా ఇలాగే యాక్షన్ తీస్కోవాలని డిమాండ్ చేశారు.
