- నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: డిప్యూటీ సీఎం భట్టి
- తొలి 5 కిలోమీటర్ల పనులు వెంటనే మొదలు
- ఆస్తులు, నివాసాలకు నష్టం లేకుండా అలైన్‌మెంట్ల మార్పు
- ఏడీబీ నుంచి తొలి దశ పనులకు రూ. 7,055 కోట్లు వచ్చినయ్
- ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు రివర్ ఫ్రంట్ నిర్మాణం
- మధ్య మధ్యలో రబ్బర్ డ్యామ్‌ల నిర్మాణంతో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్.. సినిమా థియేటర్లు, హోర్డింగ్‌ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తమని వెల్లడి
- ప్రజాభవన్‌లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
- హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం
హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించి.. 2027 డిసెంబర్ నాటికి ఫస్ట్ ఫేజ్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల ఆస్తులకు తక్కువ నష్టం.. ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఈ ప్రాజెక్టును పారదర్శకంగా, మానవీయ కోణంలో చేపడతామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.
సుమారు రూ.7,055 కోట్లతో చేపట్టే మొదటి దశ పనులకు ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) నుంచి నిధులు సమకూర్చుకునే ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కమిటీ వెల్లడించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం ప్రజా భవన్‌లో జరిగిన ఈ కీలక సమీక్ష సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతి, నిర్మాణ క్యాలెండర్, సాంకేతిక అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా 5 దశల్లో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న 21 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి సమస్య లేని తొలి 5 కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు.
ఈస్ట్ -టు-వెస్ట్ కారిడార్‌లో నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఉప్పల్ భగాయత్ నుంచి గౌరెల్లి వరకు విస్తరణ, మీర్ ఆలం ట్యాంక్ అభివృద్ధి, రక్షణ శాఖ భూములతో గాంధీ సరోవర్ ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు. ఆర్థిక, అనుమతులు, ఇతర విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని, రాజధాని అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవాలని స్పష్టం చేశారు.
నదికి ఇరువైపులా రోడ్లు, నాలాలు..
మూసీ పునరుజ్జీవంలో భాగంగా నదిని క్లీన్చేయడం, రివర్ బెడ్ ప్రొఫైలింగ్, వరద నియంత్రణకు రిటైనింగ్ వాల్స్ , నదికి ఇరువైపులా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ , బ్యారేజీల నిర్మాణం తదితర అంశాలతో కూడిన డీపీఆర్‌ను మూసీ ప్రాజెక్టు ఎండీ ఈవీ నర్సింహారెడ్డి మంత్రులకు వివరించారు. నాణ్యతా ప్రమాణాల కోసం ఐఐటీ, జేఎన్‌టీయూ సంస్థల సహకారం తీసుకోవాలని మంత్రులు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణాల్లో జాగ్రత్తలు పాటించాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా నదిలో మూసీలో నీటి నిల్వను పెంచి బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ కోసం రబ్బర్ డ్యామ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
'ఒబెర్ మేయర్ స్పిల్ వే గేట్ టెక్నాలజీ'ని ఉపయోగించి వీటిని నిర్మించనున్నట్టు అధికారులు మంత్రులకు వివరించారు. ముంబై, నాసిక్ నగరాల్లో ఈ సాంకేతికతపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు మంత్రులు సూచించారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో విశ్వసనీయత పెంచేందుకు బస్టాండ్లు, మెయిన్ రోడ్లలో హోర్డింగ్స్, సినిమా థియేటర్లలో వీడియోల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఐఐటీ, జేఎన్‌టీయూల సాంకేతిక సహకారం తీసుకోవాలని మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రాజెక్టులో భాగంగా వరద నియంత్రణ కోసం రిటైనింగ్ వాల్స్, నదికి రెండు వైపులా రోడ్లు, మురుగు కాలువలు, నీటి నిల్వ కోసం బ్యారేజీలు నిర్మించనున్నారు. అభివృద్ధి అంటే మనుషులను దూరం చేయడం కాదని, వారిని భాగస్వాములను చేయడమేనని మంత్రులు తేల్చి చెప్పారు. ప్రాజెక్టుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు థియేటర్లు, ప్రధాన రహదారుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు అతి తక్కువ ప్రభావం చూపేలా అలైన్‌మెంట్‌ను రూపొందించాలని సూచించారు.
ఈ సమావేశంలో మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, మూసీ ప్రాజెక్టు ఎండీ ఈవీ నర్సింహ్మరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
సహకరించాలని మధుపార్క్ రిడ్జ్ అసోసియేషన్ ప్రతినిధులకు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, చట్టబద్ధంగా తగిన పరిహారం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రజా భవన్‌లో మూసీ పునరుజ్జీవ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబును మధుపార్క్ రిడ్జ్ (బి-బ్లాక్) రెసిడెన్షియల్ అసోసియేషన్ నాయకులు కలిశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున మంత్రులకు వినతిపత్రం సమర్పించారు. అసోసియేషన్ప్రతినిధులు వ్యక్తం చేసిన సందేహాలు, అపోహలను మంత్రులు నివృత్తి చేశారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించేందుకు చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో మధుపార్క్ రిడ్జ్ అసోసియేషన్ అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జీవీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
