నకిలీ బంగారంతో ముత్తూట్ ఫైనాన్స్ రూ.కోటి ముంచిండు

నకిలీ బంగారంతో ముత్తూట్ ఫైనాన్స్  రూ.కోటి ముంచిండు
  •     ముత్తూట్​ ఫైనాన్స్​ మేనేజర్​ మోసం
  •     జాబ్​ రిజైన్​ చేసి ఎస్కేప్​   నిందితుడి కోసం 
  • గాలిస్తున్న పోలీసులు

హుజూర్‌‌నగర్, వెలుగు: హుజూర్ నగర్ పట్టణంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మాజీ మేనేజర్ రూ.కోటి వరకు బాధితులను ముంచి పరారయ్యాడు. ఏపీ గుంటూరు‌‌కు చెందిన శివ ముత్తూట్ ఫైనాన్స్‌‌లో మేనేజర్‌‌గా పనిచేసిన సమయంలో రూ.కోటికి పైగా మోసాలకు పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. సోమవారం పట్టణానికి చెందిన బెల్లంకొండ రమేశ్​నాగరాణి దంపతులు తమ వద్ద ఉన్న బంగారు బిస్కెట్లను వస్తువులుగా చేయించుకోవడానికి శ్రీసాయిరాం జ్యువెలర్స్‌‌కు వెళ్లారు. అక్కడి యజమాని బంగారం నకిలీదని చెప్పడంతో వారు షాక్‌‌కు గురయ్యారు. 

సంవత్సరం క్రితం శివ తమ వద్ద అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బుతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చి, అతని దగ్గర నుంచి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేశామని బాధితులు తెలిపారు. ఈ విషయం పట్టణంలో సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మరికొంత బాధితులు బయటకు వస్తున్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకుని ఇంట్లో ఉంచుకున్న వారు పరిశీలించగా నకిలీ బంగారం అని తేలడంతో లబోదిబోమంటున్నారు. అసలు బంగారు వస్తువులు మార్పిడి చేసి రూ.కోటికి పైగా మోసాలకు పాల్పడ్డాడని సమాచారం. ప్రస్తుతం శివ పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు 
దర్యాప్తు ప్రారంభించారు.