V6 News

జర్నలిజం దయనీయ స్థితిలో ఉన్నది  :  ఎంవీఆర్ శాస్త్రి

జర్నలిజం దయనీయ స్థితిలో ఉన్నది  :  ఎంవీఆర్ శాస్త్రి
  • జీవన సాఫల్య పురస్కార సభలో ఎంవీఆర్ శాస్త్రి ఆవేదన
  • సోషల్ మీడియాను మెయిన్ స్ట్రీమ్ మీడియా గుడ్డిగా అనుసరించడం బాధాకరం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జర్నలిజంలో 50 ఏండ్ల పాటు సేవలందించిన ఎంవీఆర్ శాస్త్రికి వర్కింగ్ జర్నలిస్టు ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ)  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ‘జీవన సాఫల్య పురస్కారం’ అందజేశారు. బుధవారం సోమాజిగూడలోని కత్రియ హోటల్​లో ‘ఎం.వి.ఆర్. శాస్త్రి అమృతోత్సవ వేడుకలు’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ, ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ, జస్టిస్ గోపాల గౌడ్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంవీఆర్ శాస్త్రి నైతిక విలువలతో కూడిన జర్నలిజం చేశారని కొనియాడారు. ఆయన రాసిన ‘ఉన్న మాట’, ‘కశ్మీర్ కథ.. కశ్మీర్ వ్యథ’, ‘కరుణాచలం.. అరుణచలం’ వంటి రచనలు ఎందరికో స్ఫూర్తి కలిగించాయన్నారు.

ప్రస్తుత పరిస్థితులు బాధాకరం

ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ.. నేటి జర్నలిజం తీరుతెన్నులపై ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం మీడియా దయనీయ పరిస్థితుల్లో ఉందని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను మెయిన్ స్ట్రీమ్ మీడియా గుడ్డిగా అనుసరించడం బాధాకరమన్నారు. ‘కుక్క తోకను ఆడిస్తుందా? తోక కుక్కను ఆడిస్తుందా?’ అన్న చందంగా నేటి పరిస్థితులు మారాయని, సోషల్ మీడియా చేసే పనే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చేయడం సరికాదన్నారు.

రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ గురించి ప్రత్యేకంగా లేకపోయినా, జర్నలిస్టులపై సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు. ప్రభుత్వాలు, జ్యుడీషియరీ వంటి వ్యవస్థల్లో లోపాలు ఉన్నప్పుడు కేవలం మీడియాని మాత్రమే వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదని, ఎక్కడో ఒకరు తప్పు చేసినంత మాత్రాన వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టలేమన్నారు. కార్యక్రమంలో శంకర్ నారాయణ, జస్టిస్ గోపాల గౌడ్, జి. వల్లీశ్వర్, రాణా ప్రతాప్, గంగాధర శాస్త్రి, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.