
- నగరంలో అందరికీ జీవించే హక్కు ఉంది
- మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
కూకట్పల్లి, వెలుగు: హైదరాబాద్ అన్ని కులమతాలకు ఆశ్రయమిచ్చే గొప్ప నగరదని, ఇక్కడి నుంచి మార్వాడీలను వెళ్లాలని అనడం సరికాదని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. కుత్బుల్లాపూర్ దూలపల్లిలోని తన నివాసంలో గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రాంతాలకతీతంగా ఎక్కడి వారైనా హైదరాబాద్లో జీవించవచ్చన్నారు.
అభివృద్ధి కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని, ఎవరికో వ్యతిరేకంగా కాదని అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని తాము కోరుకుంటున్నామన్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఓ వర్గాన్ని మొత్తం బదనాం చేయడం సరికాదన్నారు. రాజకీయ రంగు పులిమి కొందరు మార్వాడీస్ గో బ్యాక్ నినాదాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రజాస్వామిక దేశంలో ఎక్కడైనా జీవించే హక్కును గుర్తుంచుకోవాలన్నారు.