తెలంగాణ కల్చర్‌‌‌‌ పై  సినిమాలు ఎందుకు తీయడంలేదని అడిగారు: నాగార్జున 

తెలంగాణ కల్చర్‌‌‌‌ పై  సినిమాలు ఎందుకు తీయడంలేదని అడిగారు: నాగార్జున 

‘పళ్ళ బురుసు’ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని,  అదే సమయంలో కన్నీళ్లతో  మనసు బరువెక్కిందని  నాగార్జున అన్నారు.   తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తున్న  ఈ కామెడీ డ్రామాకు ఉదయ్ చౌహన్ దర్శకత్వం వహించాడు.  అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలిసి  నిర్మించాయి.  ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇందులో తండ్రీకొడుకులుగా నటించారు. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ నిర్వహించారు.  నాగార్జున మాట్లాడుతూ ‘అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌‌‌‌పై ఎన్నో మంచి సినిమాలు చేశాం. ఇకపై మరింత వేగంగా, మరింత బలంగా సినిమాలు చేయాలని, ఎక్కువమంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.  అందులో భాగంగానే ఈ సినిమాలు చేస్తున్నాం.  ఇక ఆమధ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మా ఫిల్మ్ స్కూల్‌‌‌‌కు వచ్చినప్పుడు.. ‘తెలంగాణ కల్చర్ మీద మీరు సినిమా ఎందుకు తీయడంలేదు’ అని అడిగారు.  

ఆ  టైమ్‌‌‌‌లోనే ఈ కథ మా దగ్గరకు వచ్చింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. తల్లిదండ్రులను చూసుకోవడాన్ని మించిన అదృష్టం మరొకటి ఉండదు. అలాంటి  కాన్సెప్ట్‌‌‌‌తో రాబోతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉందని నటీనటులు అన్నారు. 

అందరి మనసులను హత్తుకునే సినిమా ఇదని దర్శకుడు ఉదయ్ చౌహన్ అన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌‌‌‌తో కలిసి పనిచేయడం  ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని  నిర్మాత వివేక్ కృష్ణాణి అన్నారు.