- ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సమావేశంలో నక్క యాదగిరి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ శాఖలో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలతో చిన్న, చిన్న ఎలక్ట్రికల్ పనులు చేసే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ కు రాష్ట్రంలోని ఎలక్ర్టికల్ కాంట్రాక్టర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నక్క యాదగిరి మాట్లాడారు. విద్యుత్ శాఖ స్టోర్లలో అవసరమైన మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) ఇవ్వడంలో ఆలస్యం కావడంతో అనేక పనులు పెండింగ్‌లో పడిపోయాయని తెలిపారు. ఇటువంటి సమస్యలతో చిన్న, చిన్న ఎలక్ట్రికల్ పనులు చేసే కాంట్రాక్టర్లు నిరుద్యోగుల్లా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్లు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుండటంతో ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై స్పందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. గౌరవ అధ్యక్షుడిగా ఎ. మహేందర్, అధ్యక్షుడిగా ఎం. కనకాచారి, ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ రెడ్డి, కోశాధికారిగా రాజు, ఉపాధ్యక్షులుగా వి. సత్యనారాయణ, వి. నవీన్ తదితరులు ఎంపికయ్యారు.
