- నకిరేకల్ లో రూ.38 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి రెడీ
- నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- దశాబ్దాలుగా వేధిస్తున్న వైద్య సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం
- ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల శంకుస్థాపనకూ ఏర్పాట్లు
నల్గొండ, వెలుగు : హైదరాబాద్–--విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65) పై ప్రయాణించే వాహనదారులకు, స్థానిక ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న వైద్య సమస్య ఎట్టకేలకు శాశ్వతంగా పరిష్కారం కానుంది. గతంలో ఈ హైవేపై ప్రమాదాలు జరిగితే గాయపడిన వారిని వైద్యం కోసం హైదరాబాద్ తరలించాల్సి వచ్చేది. సరైన సమయంలో వైద్యం అందక బాధితులు ప్రాణాలు కోల్పోయేవారు. ఈ క్రమంలో నకిరేకల్ టౌన్లో రూ.38 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి రావడంతో అటు హైవే ప్రయాణికులకు, ఇటు నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని వందలాది గ్రామాల ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట (గోల్డెన్ అవర్)లో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
180 కిలోమీటర్ల హైవే..
ఎన్‌హెచ్-65 హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. రోజూ వేలాది వాహనాలు ప్రయాణించే హైవేపై సూర్యాపేటలో మెడికల్ కాలేజీ మినహా అత్యవసర వైద్యమందించే పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో హైవేపై జరిగే ప్రమాదాల్లో ఎంతోమంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గోల్డెన్అవర్ బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు అత్యంత కీలకం. కానీ ఈ హైవేపై నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను నల్లగొండ, హైదరాబాద్ తరలించాల్సి రావడంతో ఇన్‌టైంలో వైద్యం అందక మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నకిరేకల్ టౌన్లో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. 24/7 ట్రామా కేర్, అధునాతన ఐసీయూ బెడ్లు, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగాలు ఏర్పాటు చేసింది. కొన్నాళ్లుగా మందకొడిగా సాగిన ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవ చూపారు.
కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు
హైవే ప్రమాద బాధితులకే కాకుండా, నకిరేకల్ పరిధిలోని వందలాది గ్రామాల ప్రజలకు ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందనున్నాయి. సాధారణ శస్త్రచికిత్సలతో పాటు ఎమర్జెన్సీ ఆపరేషన్లకు కూడా చేసే వెలుసుబాటు ఇక్కడ కల్పించారు. గర్భిణులకు సుఖ ప్రసవాలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువులకు ఐసీయూ సేవలు, రోగ నిర్ధారణకు అత్యాధునిక డిజిటల్ ఎక్స్-రే, స్కాన్ యూనిట్లు, 24 గంటల పాథాలజీ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చారు. వెయిటింగ్ హాళ్లు, తాగునీటి ప్లాంట్లు, విశాలమైన పార్కింగ్ వసతులు కల్పించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా 24/7 సీసీ టీవీ నిఘా, అగ్నిమాపక భద్రతా వ్యవస్థలతో పాటు ప్రత్యేక సెక్యూరిటీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటన ఇలా..
నేడు మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి నకిరేకల్ చేరుకుంటారు. రూ.38 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా, సీఎం పర్యటనను సక్సెస్‌కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడంతో పాటు సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. నల్గొండ, చిట్యాల, నార్కట్ పల్లి, కట్టంగూర్, శాలిగౌరారం, కేతేపల్లి ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే ప్రజలు తమ వాహనాలతో తిప్పర్తి సర్వీస్ రోడ్డు నుంచి దిగి, ఇందిరాగాంధీ సెంటర్‌మీదుగా సభా ప్రాంగణమైన మినీ స్టేడియం గ్రౌండ్‌కు చేరుకోవాలి. ట్రాఫిక్ మళ్లింపులు, పోలీసుల సూచనలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– శరత్ చంద్ర పవార్, ఎస్పీ, నల్గొండ
