తాళి మహిళలే ఎందుకు కట్టుకోవాలి?.. మగాళ్లకు ఈ రూల్స్ ఎందుకు లేవు? నమిత సంచలన వ్యాఖ్యలు..

తాళి మహిళలే ఎందుకు కట్టుకోవాలి?.. మగాళ్లకు ఈ రూల్స్ ఎందుకు లేవు? నమిత సంచలన వ్యాఖ్యలు..

ఒక్కప్పుడు సౌత్ ఇండియన్ సినిమాల్లో గ్లామర్ క్వీన్‌గా.. 'సింహా', 'బిల్లా', 'సొంతం', 'అళగియ తమిళ్ మగన్' వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి నమిత మళ్లీ వార్తల్లో నిలిచారు. వివాహం తర్వాత వెండితెరకు కొంత దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నారు. అయితే, లేటెస్ట్ గా వివాహ వ్యవస్థ, సమాజం మహిళలపై రుద్దే ఆచారాలపై నమిత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నమిత.. పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు ఇన్ని నిబంధనలు? అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా తాళి, బొట్టు వంటి సంప్రదాయాలను ప్రస్తావిస్తూ.. "పెళ్లయిన తర్వాత మహిళ మాత్రమే తాళి ఎందుకు ధరించాలి? బొట్టు పెట్టుకోవాలని, కొన్ని సంప్రదాయాలు పాటించాలని మహిళలకే ఎందుకు చెబుతారు? మరి పురుషులకు ఇలాంటి రూల్స్ ఎందుకు లేవు? అసలు భగవద్గీతలో గానీ, వేదాలు, పురాణాల్లో గానీ స్త్రీలు మాత్రమే తాళి కట్టుకోవాలని రాసి ఉందా?" అంటూ సూటిగా ప్రశ్నించారు.

అంతటితో ఆగకుండా భర్త క్షేమం కోసం ఆచరించే వరలక్ష్మీ వ్రతం వంటి పూజల గురించి మాట్లాడుతూ.."భార్యగా నేను నా భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేస్తాను. మరి ఒక భర్త తన భార్య ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ఏడాదిలో కనీసం ఒక్క రోజైనా కేటాయిస్తాడా? అలాంటి నియమం సమాజంలో ఉందా? అసలు నియమాలన్నీ కేవలం ఆడవాళ్ల కోసమే ఎందుకు రాశారు?" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ తరహా ఆచారాలన్నీ భగవంతుడు సృష్టించినవి కావు... సమాజమే తన సౌకర్యం కోసం తయారు చేసి మహిళలపై బలవంతంగా రుద్దిందని నమిత అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు నమిత వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం సంప్రదాయాలను తప్పుపట్టడమేంటని విమర్శిస్తున్నారు. 2020లో వచ్చిన 'మియా' చిత్రం తర్వాత నటిగా కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోని నమిత, ప్రస్తుతం తన వ్యాఖ్యలతో మాత్రం హాట్ టాపిక్‌గా మారారు.