మంగరి బస్తీ సమస్యలు తీరుస్తం..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మంగరి బస్తీ సమస్యలు తీరుస్తం..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లిలోని మంగరి బస్తీలో ఇద్దరు గల్లంతు కావడం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం జీహెచ్ఎంసీ కమిషనర్ తో సహా స్థానిక అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారుల బృందంతో కలిసి బుధవారం మంగరి బస్తీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

 గల్లంతైన అర్జున్, రామ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడిన కేంద్రమంత్రి.. బస్తీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో వరద నియంత్రణకు స్థానికులతో చర్చించి, నాలా డైవర్షన్​పై వారం రోజుల్లో అధికారులు ప్రణాళిక రెడీ చేయనున్నట్లు చెప్పారు. నాలా పూడిక కూడా తీయాల్సి ఉందన్నారు. 

నాలుగు రోజులైనా ఆచూకీ దొరకలే

ముషీరాబాద్/మెహిదీపట్నం, వెలుగు: నాలాల్లో గల్లంతైన వారి ఆచూకీ నాలుగు రోజులైనా దొరకలేదు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం, వరద కారణంగా ముషీరాబాద్‌‌‌‌‌‌‌‌ వినోభానగర్​కు చెందిన దినేశ్, నాంపల్లిలోని మంగరి బస్తీకి చెందిన అర్జున్, రాము కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వీరి ఆచూకీ కోసం జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది బుధవారం కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. ఫలితం దక్కలేదు. కాగా, వినోబా నగర్​లో దినేశ్‌‌‌‌‌‌‌‌ కుటుంబం సభ్యులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎంఆర్పీఎస్‌‌‌‌‌‌‌‌ నేతలతో కలిసి చౌరస్తాలో బైఠాయించారు. ఆచూకీ గుర్తించడంలో అధికారులు చర్యలు చేపట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.