అసలు ఈ ‘నందూస్ వరల్డ్’ గొడవేంటి..? కోట్లకు ముంచేశారనే ఆరోపణల్లో నిజం ఉందా..?

అసలు ఈ ‘నందూస్ వరల్డ్’ గొడవేంటి..? కోట్లకు ముంచేశారనే ఆరోపణల్లో నిజం ఉందా..?

‘నందూస్ వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న భార్యాభర్తలు UKలో వీసా, తమ కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ఇప్పిస్తామని చెప్పి వందల మంది నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ భార్యాభర్తలు కలిసి ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల దాకా వసూలు చేశారని పలువురు యూట్యూబర్లు, జర్నలిస్టులు పెద్ద స్కాం జరిగిందని సోషల్ మీడియాలో చర్చించడంతో ఈ విషయం వైరల్ అయింది.

యూకే వీసా ఆశతో 50 నుంచి 100 మంది దాకా.. ఒక్కొక్కరు దాదాపు రూ. 20 లక్షలు చెల్లించారని.. మొత్తం రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల దాకా వసూలు చేశారని ఆరోపణలున్నాయి. కొంతమంది బ్యాంకు స్టేట్మెంట్లతో సహా సోషల్ మీడియాలో స్క్రీన్షాట్స్ పోస్ట్ చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ ఆరోపణలపై నందూస్ వరల్డ్ ఛానల్లోనే ఒక వీడియో పోస్ట్ చేసి వివరణ ఇచ్చారు. ఈ వీడియోలో ఇండియాలో నందు, మధుకర్ తరపున వారి అడ్వకేట్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. 

UKలో స్థిరపడిన నందు, మధుకర్ అనే భార్యాభర్తలు "నందుస్ వరల్డ్" పేరుతో తెలుగు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఈ ఛానల్‌కు సుమారు 2.89 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 620కి పైగా వీడియోలు, 2.67 బిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ ఛానల్ను జూన్ 26, 2020 నుంచి నడుపుతున్నారు. నందు యాస, భాషకు మంచి క్రేజ్ రావడంతో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

ఇక.. ఈ నందు ఎవరంటే.. గుంటూరు జిల్లా వడ్లమూడి నందు స్వస్థలం. ఆ తర్వాత ఆమె అమ్మా నాన్న ఉద్యోగాల కోసం విజయవాడ వెళ్లారు. అమ్మమ్మ, తాతయ్య దగ్గరే నందు పెరిగింది. ఇరవై ఏండ్లు ఇండియాలోనే ఉంది. యూకేకు వెళ్లి 20 ఏళ్లు దాటింది. యూకే వెళ్లిన కొత్తలో పదిహేనేండ్లు జాబ్‌‌ చేసింది. యూట్యూబ్‌‌ వీడియోలు చేయడం కోసం ఆ జాబ్‌‌ మానేసింది.

జాబ్‌‌ కంటే వీడియోలు చేయడంలోనే సంతృప్తి, ఆనందం ఉందని ఆమె చెప్పింది. ఆమె, ఆమె భర్త కలిసి UKలో చేసిన బిజినెస్లు సక్సెస్ కావడంతో ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఆమెకు గానీ, ఆమె భర్తకు గానీ లేకుండా పోయింది. సొంత ఇల్లు, కార్లు.. UKలో నందు కుటుంబం విలాసవంతమైన జీవనం సాగిస్తున్నారు.