అరుదైన ఫీట్ అందుకున్న నాని.. వంద కోట్ల క్లబ్బులోకి ‘దసరా’

అరుదైన ఫీట్ అందుకున్న నాని.. వంద కోట్ల క్లబ్బులోకి ‘దసరా’

ఈగ సినిమా తర్వాత మొదటి సారి న్యాచురల్ స్టార్ నాని రేర్ ఫీట్ ను అందుకున్నాడు. పాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన దసరా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ పీరియాడిక్ డ్రామా పాజిటివ్ రివ్యూలను సంపాదించుకుంది. అక్కడక్కడా డివైడ్ టాక్ వినిపించినా అవి కలెక్షన్లపై అంతగా ప్రభావం చూపలేకపోయాయి. తాజాగా  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. వంద కోట్లు కొల్లగొట్టింది. దీంతో నాని ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘‘మా కష్టానికి మీరిచ్చిన గిఫ్ట్ దసరా విజయం’’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ అరుదైన రికార్డుతో నాని స్టార్ డం ను సొంతం చేసుకున్నాడు. మరోసారి వంద కోట్ల క్లబ్బులో చేరిపోయాడు. తెలంగాణ పెద్దపల్లిలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. 

మొదటి సినిమాతోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. నానిని ఇంతకు ముందెన్నడూ చూడని రోల్ లో చూపించి సక్సెస్ అయ్యాడు. సినిమాను నిర్మించిన ఎస్ఎల్వీ సంస్థ సైతం ఈ బాక్సాఫీస్ విజయంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేసింది. తమ సినిమా ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టిందని తెలిపింది. ‘‘ విడుదలైన ఆరు రోజుల్లోనే దసరా వంద కోట్ల క్లబ్బులో చేరింది. నాని కెరీర్లో ఇదొక మైలు రాయి లాంటిది. ఓవర్సీస్ లోనూ దీనికి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది’’ అని సంస్థ పేర్కొంది.