- పర్వతాపూర్ 5 నంబర్సర్వేలోని 77 గజాల ప్లాటుకు అక్రమ రిజిస్ట్రేషన్
- ఎక్కడో ఉన్న ఏడో నంబర్ సర్వేలో ఉన్నట్టు చూపిన్రు
- 16 ప్లాట్ల పరిస్థితీ అంతే.. ఉన్నతాధికారుల పాత్ర
మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా నారపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో భూ‘మాయ’ నడుస్తోంది. ఎక్కడో ఉన్న సర్వే నంబర్లను.. ఎక్కడెక్కడికో తీసుకువెళ్లి నచ్చిన వారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 700 మీటర్ల దూరంలోని ఓ సర్వే నంబర్‌ను మరో సర్వే నంబర్లోని 77 గజాల ప్లాటుకు వేసి రిజిస్ట్రేషన్చేసేశారు. అంతేగాకుండా ఇక్కడున్న మరో 16 ప్లాట్లను ప్రజావసరాల కోసం కేటాయించగా, వాటిని కూడా ఇలాగే దొంగ రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం. ఈ తతంగం అంతా ఆ శాఖకు చెందిన జిల్లా ముఖ్య అధికారికి తెలిసే జరిగిందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
మధ్యలో కొత్త నంబర్ ఎక్కడిది?
పర్వతాపూర్ పరిధిలోని సాయిప్రియ కాలనీలో సాలర్జంగ్కంచలోని సాయిప్రియ వెంచర్‌లో 5 నుంచి 10 వరకు సర్వే నంబర్లు ఉన్నాయి. ఇందులో ప్లాట్ నంబర్ 1232 (నార్త్) సర్వే 5లో ఉంది. దీని పక్కనే 8, 9 సర్వే నంబర్లున్నాయి. 1,232 ప్లాట్77 గజాలుండగా, దీన్ని ఎక్కడో 700 మీటర్ల దూరంలో ఉన్న సర్వే నంబర్7 పేరిట రిజిస్ట్రేషన్చేశారు. అయితే, అందులో 1232(సౌత్) గా చూపించారు. చుట్టూ 8,9 సర్వే నంబర్లే ఉంటే మధ్యలోని చిన్న బిట్టుకు దూరంలో ఉన్న సర్వే నంబర్ఎలా వస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇదొక్కటే కాదు.. మరో 16 ప్లాట్లు కూడా..
5 సర్వే నంబర్లో ఉన్న 1232 ప్లాటే కాకుండా 100 గజాలలోపు ఉన్న మరో 14 నుంచి 16 ప్లాట్లకు కొత్త సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి నారపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు. కాగా, ఇందులో ఈ శాఖ ముఖ్య అధికారి పాత్ర ఉండడంతోనే రికార్డుల తారుమారయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డాక్యుమెంటు క్యాన్సిల్ చేస్తాం: సబ్ రిజిస్ట్రార్
తమ ఆఫీసులో ఎలాంటి పొరపాటు జరగలేదని, ఒకవేళ అదే జరిగినట్టయితే డాక్యుమెంట్ క్యాన్సిల్ చేస్తామని నారపల్లి సబ్ రిజిస్ట్రార్శ్రీదేవి చెప్పారు. ఈ విషయమై జిల్లా రిజిస్ట్రార్అశోక్ కుమార్ కు కాల్ చేసి వివరణ అడుగుతుండగానే ఫోన్పెట్టేశారు. తర్వాత స్విచాఫ్ చేసుకున్నారు.
ముమ్మాటికీ తప్పు జరిగింది
సాయి ప్రియ వెంచర్‌లోని సర్వేనెంబర్ 5 నుంచి10 వరకు సర్వే నంబర్ల ఉండగా, ఎక్కడో ఉన్న 7 సర్వే నెంబరు వేసి ఐదో నంబర్సర్వేలోని1232 ప్లాటుకు రిజిస్ట్రేషన్చేశారు. అప్పుడున్న జీపీఏ హోల్టర్పేరు ఒకటైతే...ఇప్పుడు మరో జీపీఏ హోల్డర్పేరు పెట్టారు. ప్రజావసరాల కోసం కేటాయించిన ఆ బిట్టును జీపీఏ చేయడానికి అవకాశమే లేదు. అయినా, ఇష్టమున్నట్టు చేసి పడేశారు. ఇది ఎలా సాధ్యం ? అధికారులు తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చనడానికి ఇదో ఉదాహరణ.
– నారగోని ప్రవీణ్ , రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు

