- టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య
హైదరాబాద్, వెలుగు: గంజాయి, డ్రగ్స్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడితేనే భయం కలిగి వాటి రవాణా, వాడకం తగ్గుముఖం పడతాయని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. శుక్రవారం ఎక్సైజ్ అకాడమీలో ట్రైనీలకు నార్కోటిక్ డ్రగ్స్, చట్టాలు, కేసులు నమోదు చేసే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో 31 మంది ఏఈఎస్‌లు, 84 మంది ఎస్సైలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడితేనే సమాజంలో భయం కలుగుతుందని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌ను పట్టుకున్నప్పుడు అనుసరించాల్సిన ప్రాథమిక విధానాలు, పంచనామా తయారీ, జీడీ ఎంట్రీ, ఉన్నతాధికారుల అనుమతులు, ఎఫ్‌ఐఆర్‌లో ఉండాల్సిన వివరాలు, కేసు నమోదు, చార్జ్‌షీట్ తయారీ అంశాలపై వివరించారు.
టీజీ న్యాబ్ ద్వారా ముద్రించిన చట్టాలకు సంబంధించిన పుస్తకాలను ట్రైనీలకు ఉచితంగా పంపిణీ చేశారు. అకాడమీ డైరెక్టర్ సురేశ్ రాథోడ్, జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి పాల్గొన్నారు.

