ఆటో డ్రైవర్ ​అప్రమత్తతతో కృష్ణా ఎక్స్​ప్రెస్​ కు తప్పిన ప్రమాదం

ఆటో డ్రైవర్ ​అప్రమత్తతతో కృష్ణా ఎక్స్​ప్రెస్​ కు తప్పిన ప్రమాదం
  • నిలిచిన రాజధాని, కృష్ణా ఎక్స్​ప్రెస్​ 
  • ఆటో డ్రైవర్​అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​సమీపంలో రైల్వే లైన్ ​పట్టా విరగడం, ఓ ఆటో డ్రైవర్​ గమనించి సమాచారమివ్వడంతో పెను ముప్పు తప్పింది. సికింద్రాబాద్​నుంచి సిర్పూర్​కాగజ్​నగర్​ వెళ్లే ఎక్స్​ప్రెస్​ రైలు స్టేషన్​ఘన్​పూర్​లో ఉదయం ఏడు గంటలకు ఆగి కాజీపేటకు బయల్దేరింది. అంతకుముందే స్టేషన్​ఘన్​పూర్​లోని రైల్వేగేట్ నంబర్​49 సమీపంలో రైల్వే పట్టా విరిగి ఉంది. దీని మీది నుంచే సిర్పూర్ ​కాగజ్​నగర్​ ఎక్స్​ప్రెస్​ వెళ్లగా పెద్ద శబ్ధం వచ్చింది. గేట్​సమీపంలో తోపుడు బండి దగ్గర టిఫిన్ ​తింటున్న స్టేషన్​ఘన్​పూర్​ఆటో యూనియన్​ అధ్యక్షుడు రాజారపు జయపాల్​దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ రైలుపట్టా విరిగి కనిపించడంతో రైల్వే స్టేషన్​ రెండో ప్లాట్​ఫాం వైపు ఆగి ఉన్న గూడ్స్​రైలు ఇంజిన్​ డ్రైవర్​కు చెప్పాడు.​ 

అతడు వాకీటాకీలో రైల్వే ఆఫీసర్లను అప్రమత్తం చేశాడు. వారి ఆదేశాలతో ఇంజినీరింగ్​ విభాగం ట్రాక్​మెన్​ శ్యామ్​, సిబ్బంది పట్టాకు తాత్కాలిక రిపేర్లు చేశారు. అరగంటపాటు శ్రమించి క్లాంప్​లు బిగించారు. దీంతో సికింద్రాబాద్ ​నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్​ప్రెస్​ జనగామలో 15 నిమిషాలు, సికింద్రాబాద్​ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్​ప్రెస్​ స్టేషన్ ​ఘన్​పూర్​లో 10 నిమిషాలు ఆపాల్సి వచ్చింది. తర్వాత వెళ్లే రైళ్లను గంటకు 20 కిలో మీటర్ల వేగంతో పంపించడంతో ఎటువంటి ఇబ్బంది రాలేదు. కాజీపేట నుంచి రైల్వే ఆఫీసర్లు, ట్రాక్​మెన్​ సిబ్బంది స్టేషన్​ఘన్​పూర్​కు చేరుకుని విరిగిన రైలు పట్టాకు శాశ్వత రిపేర్లు చేశారు.