V6 News

ఘనంగా నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ డే వేడుకలు

ఘనంగా నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ డే వేడుకలు

హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజి గూడ ప్రెస్​క్లబ్​లో 36వ నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేషనల్ మినరల్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌‌‌‌ఎండీసీ), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌‌‌‌సీసీఎల్) సహకారంతో పీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ హైదరాబాద్ చాప్టర్  ఈ వేడుక లను నిర్వహించింది. చీఫ్​గెస్టుగా హాజరైన మాజీ సీఎస్ డాక్టర్ ఎస్కే జోషి మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన థీమ్ (జీ– 20 భారతీయ విలువలు- ప్రజా సంబంధాల దృక్పథాలు)ను ఈ ఏడాది ఎంచుకున్నందుకు పీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ నాయకత్వాన్ని అభినందించారు. భారతదేశం జీ – 20 అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత  చేపట్టిన అనేక కార్యక్రమాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త విశ్వాసాన్ని ఇచ్చాయన్నారు.  అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ డీన్, జర్నలిజం ప్రొఫెసర్ కె. స్టీవెన్‌‌‌‌సన్ మాట్లాడుతూ..- సమాచార సాంకేతిక రంగం ప్రజలు, సమాజాలు, దేశాల మధ్య కొత్త అవకాశాలు సృష్టించినప్పటికీ సమాచార సునామీతో కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందని అన్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియా వ్యవస్థ సమాచార ప్రసార రంగం రూపురేఖలను మార్చివేసిందని, తప్పుడు సమాచారం, కల్పిత సమాచారం సృష్టిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనికేషన్ వేగం పెరిగిన నేపథ్యంలో ప్రజా సంబంధాల ఆవశ్యకత బాగా ఎక్కువైందని ఆయన చెప్పారు. అనంతరం   పబ్లిక్ రిలేషన్స్ డే ప్రాముఖ్యతను పీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ జాతీయ సెక్రటరీ జనరల్ వై. బాబ్జీ వివరించారు. ప్రైవేట్, పబ్లిక్, కార్పొరేట్ రంగాల్లో పీఆర్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవడానికి, ఈ రంగంలో పరిణామాలను విశ్లేషించి దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి ప్రత్యేకమైన ఈ రోజును కేటాయించినందుకు పీఆర్ గురు, డాక్టర్ సీవీ నరసింహా రెడ్డి కృషిని కొనియాడారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ ఎస్. రాము ఆధ్వర్యంలో హైదరాబాద్ చాప్టర్ వరుస ఉపన్యాసాలు, వెబినార్లు నిర్వహిస్తున్నందుకు  అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్ పంపిన సందేశాన్ని సీనియర్ జర్నలిస్టు కృష్ణ బాజీ చదివి వినిపించారు.   సమావేశంలో కార్యదర్శి కె. యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో సర్టిఫికెట్ కోర్సు

ముషీరాబాద్: నేషనల్ పబ్లిక్ రిలేషన్ డే సందర్భంగా కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజీలో పబ్లిక్ రిలేషన్​లో సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు.  మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో ఈ సర్టిపికెట్ కోర్సును ప్రారంభించినట్లు  మేనేజ్​మెంట్ తెలిపింది.