ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ర్యాగ అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు.
కులగణన ఘనత మోడీదే..
దేశంలో 77 ఏళ్ల చరిత్రలో కులగణన చేపడుతున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని ఆర్.కృష్ణయ్య అన్నారు. కులగణన, రిజర్వేషన్ల అమలుతో బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వాటా లభిస్తుందని తెలిపారు. బీసీల ఆశయాలకు అనుగుణంగా తీసుకుంటున్న మోడీ నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రాజేందర్, అనంతయ్య, అల్లంపల్లి రామ్‌కోటి, బాలయ్య
తదితరులు పాల్గొన్నారు.
