- మొత్తం 165 సీట్లకు గాను 94 చోట్ల ఆర్ఎస్పీ అభ్యర్థులు ముందంజ
- గత ఏడాది నేపాల్‌లో జెన్ జీ నేతృత్వంలో భారీ ఎత్తున నిరసనలు
- 4- నుంచి 12 సీట్లకే పరిమితమైన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్టీ
కాఠ్మండూ: నేపాల్‌లో జెన్ జీ ఉద్యమం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మాజీ మేయర్బాలెంద్ర షా (బాలెన్) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) గెలుపు దిశగా దూసుకెళ్తోంది. గురువారం మొత్తం 165 సీట్లకు పోలింగ్జరగగా.. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఆర్ఎస్పీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 165 సీట్లలో ఆర్ఎస్పీ 6 సీట్లు గెలుచుకుంది. మరో 109 సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. బాలెన్షా తన సొంత నియోజకవర్గం ఝాపా-5లో మాజీ పీఎం ఓలిపై భారీ లీడ్‌తో ముందున్నారు.
అలాగే, నెపాలీ కాంగ్రెస్.. 7 నుంచి -11 సీట్లలో, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్టీ 4- నుంచి 12 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో నేపాల్‌లో జెన్ జీ నేతృత్వంలో భారీ ఎత్తున నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. మొదట సోషల్ మీడియా బ్యాన్‌పై మొదలైన ఈ ఆందోళనలు తర్వాత అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, పాత రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం వైపు విస్తరించాయి.
లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడంతో పోలీసుల దాడుల్లో 70 మందికి పైగా మరణించారు. అనంతరం ఈ ఉద్యమం మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఇది నేపాల్ రాజకీయాల్లో జెన్ జీ రివల్యూషన్‌గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
జెన్ జీకి ఆదర్శ నాయకుడుగా బాలెన్ షా
2022లో నేపాల్ స్థానిక ఎన్నికలతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బాలెన్ షా.. మే 2022లో నేపాల్ రాజధాని కాఠ్మండూ మేయర్‌గా ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన శ్రీజన సింగ్‌ను ఆయన ఓడించారు. షాకు 61,767 ఓట్లు రాగా.. శ్రీజన సింగ్‌కు 38,341 ఓట్లు వచ్చాయి. కేపీ శర్మ ఓలి పార్టీ అభ్యర్థి కేశవ్ సత్పిత్ మూడో స్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బాలెన్ షా గెలుపు అందరనీ ఆశ్చర్య పరిచింది. దీంతో ఆయన జెన్ జీకి ఆదర్శ నాయకుడుగా ఎదిగాడు. అతని రాప్ సాంగ్స్ సైతం పాత రాజకీయ నాయకులను, కరప్షన్‌ను బలంగా విమర్శించాయి.
ఇది యువతలో అతన్ని పాపులర్ చేసింది. అనంతరం ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ)ని స్థాపించారు. జెన్‌జీ ఉద్యమం తర్వాత ఆరు నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యువత మద్దతుతో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం వెలువడిన ఫలితాలపై బాలెన్షా ఎక్స్‌వేదికగా స్పందించారు.
‘‘ఇది జెన్ జీ విజయం. పాత రాజకీయాలు కుప్పకూలుతున్నాయి. మేము మార్పు తీసుకువస్తాం!" అని పోస్ట్ చేశారు. కాగా, నేపాల్ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అధికారిక ఫలితాలు శనివారం ఉదయం వరకు వెలువడే అవకాశం ఉందని నేపాల్ఎలక్షన్కమిషన్ తెలిపింది.
