వృద్ధ దంపతుల చోరీ కేసులో నేపాలీ ముఠా అరెస్ట్

వృద్ధ దంపతుల చోరీ కేసులో నేపాలీ ముఠా అరెస్ట్

పద్మారావునగర్, వెలుగు: వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన నేపాలీ ముఠాను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని పలు నగరాల్లో గాలింపు చేపట్టి పరారీలో ఉన్న ప్రధాన నిందితులను పట్టుకున్నట్లు మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించారు. జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ పీఎస్​పరిధిలోని కౌకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న మోహన్స్ గోల్ఫ్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నివసించే మురళీ మోహన్ నర్సిపురం దంపతులు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమనించిన మీనా, రాజేశ్ అనే నేపాలీ కార్మికులు దోపిడీకి పథకం రచించారు. 

మరో ఏడుగురు సహచరులతో కలిసి ముఠాగా ఏర్పడి, ఏప్రిల్ 25న సబీనా అనే మహిళను పనిమనిషిగా ఆ ఇంట్లో చేర్పించారు. మే 11న మీనా బర్త్​డే వేడుకల పేరిట నిందితులు సర్వెంట్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమావేశమయ్యారు. రాత్రి సమయంలో ఐదుగురు నిందితులు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ దంపతులను బంధించారు. అనంతరం వారికి మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి, ప్లాస్టిక్ టేపులతో కట్టేసి బెదిరించారు.

 ఇంట్లోని అల్మారాలు పగులగొట్టి 60 తులాల బంగారు నగలు, 15 కిలోల వెండి వస్తువులు, 2 మొబైల్ ఫోన్లు, 3,000 అమెరికన్ డాలర్ల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. 

బెంగళూరు, ఢిల్లీ, ముంబై, లక్నో, పూణేతో పాటు నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నేరం జరిగిన 5 రోజుల్లో నలుగురిని అరెస్ట్ చేయగా మరో 20 రోజుల్లో ప్రధాన నిందితులు మీనా, రాజేశ్, డేనియల్ చారో, కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి దోచుకున్న బంగారం, వెండి సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మీనా, రాజేశ్​పై గతంలో మొయినాబాద్ పీఎస్​పరిధిలో చోరీ కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు.