ఇకపై.. నెట్ఫ్లిక్స్ నెలవారీ ప్లాన్ రూ.149కే

ఇకపై.. నెట్ఫ్లిక్స్ నెలవారీ ప్లాన్ రూ.149కే

న్యూఢిల్లీ: ఓటీటీ ప్రియులకు నెట్ ఫ్లిక్స్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటివరకు ఉన్న నెలవారీ, త్రైమాసిక, సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలను భారీగా తగ్గించింది. అయితే మొబైల్ ఫోన్లలో నెట్ ఫ్లిక్స్ సేవల్ని వినియోగించేందుకు గానూ ఉన్న రూ.199 ప్లాన్ పై యాభై రూపాయలు తగ్గించింది. తాజా నిర్ణయంతో ఈ ప్లాన్ ధర రూ.149కి చేరింది. ‘హ్యాపీ న్యూ ప్రైజెస్’ పేరుతో తీసుకొస్తున్న కొత్త ప్లాన్ లు డిసెంబర్ 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. సరసమైన ధరల్లో మంచి ఎంటర్ టైన్మెంట్ ను అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా షేర్ గిల్ తెలిపారు. 

ఒకే సబ్ స్క్రిప్షన్ తో నలుగురికి యాక్సెస్ ఉండే విధంగా ఉన్న ప్రీమియం ప్లాన్ రూ.799ని మరింతగా తగ్గించి రూ.679కే ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అందుబాటులో ఉంటాయని నెట్ ఫ్లిక్స్ ఇండియా వెల్లడించింది. కాగా, అమెజాన్ ప్రైమ్ తోపాటు హాట్ స్టార్ లాంటి వీడియో ఆన్ డిమాండ్ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం  నెట్ ఫ్లిక్స్ కు ఎంతమేర ప్రయోజనం చేకూర్చుతుందో చూడాలి. ఇకపోతే, తాజా తగ్గింపుతో నెట్ ఫ్లిక్స్ నెలవారీ ప్లాన్ రూ. 149 ఉండగా.. ప్రైమ్ మంత్లీ ప్లాన్ రూ.179గా ఉంది. మరోవైపు హాట్ స్టార్ రూ. 499కే మొబైల్ వినియోగదారులకు ఏడాది సబ్ స్క్రిప్షన్ సేవల్ని అందిస్తోంది.