కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే వాహనదారులకు దేశీయ ఆయిల్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ముఖ్యంగా విలాసవంతమైన కార్లు, సూపర్‌బైక్‌లు వాడే వారికి ఈ పెంపు పెను భారంగా మారనుంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన ప్రీమియం వేరియంట్ పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచేసింది.
XP100 పెట్రోల్:
ఇండియన్ ఆయిల్ తన 'XP100' ప్రీమియం పెట్రోల్ రేటును ఏకంగా లీటరుకు రూ.11 పెంచింది. దీంతో నిన్నటి వరకు రూ.149గా ఉన్న లీటర్ ధర ఇప్పుడు రూ.160కి చేరింది. 100 ఆక్టేన్ రేటింగ్ కలిగిన ఈ ఇంధనాన్ని ఎక్కువగా మెర్సిడెస్, ఆడి వంటి లగ్జరీ కార్లు.. రేసింగ్ బైక్‌లలో వాడుతుంటారు. ఇంజిన్ లైఫ్ పెంచడానికి, వేగవంతమైన పికప్ కోసం ఈ ప్రీమియం పెట్రోల్‌ను ఉపయోగిస్తారు. తాజా పెంపుతో ధనికుల జేబులకు భారీ చిల్లు పడనుంది.
►ALSO READ | ఏప్రిల్ 1 నుంచి మారిపోయిన 16 రూల్స్.. రైలు టిక్కెట్ రీఫండ్స్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్ వరకూ..
డీజిల్ ధరల పెంపు..
కేవలం పెట్రోల్ మాత్రమే కాకుండా.. ప్రీమియం డీజిల్ వేరియంట్ అయిన 'ఎక్స్‌ట్రా గ్రీన్' రేట్లను కూడా ఇండియన్ ఆయిల్ సంస్థ పెంచింది. లీటరుకు రూ.91.49 నుంచి రూ.92.99కి పెంచారు. అంటే లీటరుపై రూ.1.50 పెరిగింది. ఇది సాధారణ డీజిల్ కంటే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది.
సామాన్యుడిపై ప్రభావం ఎంత..?
ప్రస్తుతానికి ఈ పెంపు కేవలం ప్రీమియం వేరియంట్లకు మాత్రమే పరిమితమైనప్పటికీ.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆర్థిక విధానాల నేపథ్యంలో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం, ఇప్పుడు ఇంధన ధరల సెగ తోడవడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సో వాహనదారులు ఇకపై రోడ్లపైకి రావాలంటే ఎక్కువ ఖర్చు చేయక తప్పని పరిస్థితి.
