Ranjith Balakrishnan: లైంగిక వేధింపుల కేసులో అయ్యప్పనుమ్ కోషియుమ్ ప్రొడ్యూసర్ అరెస్ట్

Ranjith Balakrishnan: లైంగిక వేధింపుల కేసులో అయ్యప్పనుమ్ కోషియుమ్ ప్రొడ్యూసర్ అరెస్ట్

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ప్రొడ్యూసర్ రంజిత్ బాలకృష్ణన్ అరెస్ట్ అయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై మార్చి 31, 2026న ఇడుక్కి జిల్లాలో పోలీసులు ఆయనని అదుపులో తీసుకున్నారు. సినిమా షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించారని ఓ యువ నటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, రంజిత్‌ను త్రిప్పునితుర మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

విచారణ అనంతరం, కోర్టు రంజిత్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు బయట మీడియాతో మాట్లాడిన రంజిత్.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఇది తప్పుడు కేసు అని పేర్కొన్నారు  అనంతరం ఆయనను ఎర్నాకుళం సబ్ జైలుకు తరలించారు. ఇక ఆయన బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

అసలు ఏమైంది:

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓ సినిమాలో నటిస్తున్న సదరు నటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. జనవరి 28న ఫోర్ట్ కొచ్చిలోని షూటింగ్ లొకేషన్‌లో తన కారవాన్‌లో అనుమతి లేకుండా ప్రవేశించి, తనను పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారని నటి ఆరోపించింది. తాను వద్దని వారించడంతో రంజిత్ వెనక్కి తగ్గినట్లు ఆమె తన ఫిర్యాదులో తెలిపింది.

బాధితురాలు ఇచ్చిన స్టేట్ మెంట్ను రికార్డ్ చేసుకున్న పోలీసులు ఆమె వివరాల్లో గోప్యంగా ఉంచారు. నటి ఇచ్చిన వివరాలను పరిశీలించిన పోలీసులు తమ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఆరోపణలకు ఆధారాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 

ఈ కేసు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద నమోదు చేయబడింది. ఇందులో లైంగిక దాడి, మహిళ గౌరవాన్ని అవమానించడం, అక్రమ నిర్బంధం, అసభ్య ప్రవర్తన వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తును ఎర్నాకుళం సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షిస్తున్నారు.

అయితే, ఇది రంజిత్‌పై వచ్చిన మొదటి ఆరోపణ కాదు. 2024లో బెంగాళీ నటి శ్రీలేఖ మిత్ర కూడా ఆయనపై వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ సమయంలో కేసు నమోదై, ఆయన కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మరోసారి ఓ యువకుడు కూడా లైంగిక దాడి ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని సాక్ష్యాలు, వాంగ్మూలాలు సేకరిస్తూ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

అయ్యప్పనుమ్ కోషియుమ్:

మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమానే, తెలుగు రీమేక్‌ మూవీ 'భీమ్లా నాయక్'. మలయాళంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ మరియు మాజీ హవిల్దార్ మధ్య జరిగే ఇగో క్లాషెస్ చుట్టూ కథ తిరుగుతుంది. ఇది 2020లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటి. అంతేకాకుండా 4 జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.