హీరోగా అనేక చిత్రాల్లో మెప్పించిన రాజశేఖర్.. ఇప్పుడు ‘బైకర్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాజశేఖర్ తన పాత్ర గురించి ఇలా మాట్లాడారు.
‘‘నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండూ నచ్చాయి. ఇందులో నేను బుల్లెట్ సునీల్ పాత్రలో కనిపిస్తా. శర్వాకు ఫాదర్‌గా, కోచ్‌గా నటించా. వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ నాది. డైరెక్టర్ అభిలాష్ నన్ను చాలా కొత్తగా చూపించారు. తన విజన్, కథ వల్లే అది సాధ్యపడింది. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా నా క్యారెక్టర్‌ని అభినందిస్తారు. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ కావాలో అభిలాష్‌కు చాలా క్లారిటీ ఉంది.
శర్వానంద్ కూడా ఇంతకుముందెప్పుడూ కనిపించని కొత్త అవతార్‌లో కనిపిస్తారు. బైకర్‌గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెర్ట్ పెట్టారు. మా మధ్య వచ్చే ఫాదర్ సన్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఇందులోని బైక్ రేసింగ్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటాయి. యూవీ క్రియేషన్స్ అంటే రాయల్ ట్రీట్‌మెంట్. హాలీవుడ్ క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
కచ్చితంగా సూపర్ హిట్ సాధించి నిర్మాతలు పెట్టిన ఖర్చు తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఇక ప్రస్తుతం పవన్ సాధినేనితో 'మగాడు' అనే సినిమా చేస్తున్నా. అలాగే నేను, రమ్య విశ్వదేవ్, శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. ‘బైకర్’తోపాటు ఈ రెండు సినిమాలు కూడా నా కెరీర్‌లో చాలా మంచి సినిమాలు అవుతాయని నమ్మకం ఉంది’’.
