ఠాక్రే కుటుంబానికి మేం వ్యతిరేకం కాదు

ఠాక్రే కుటుంబానికి మేం వ్యతిరేకం కాదు

ఠాక్రే కుటుంబానికి తాము వ్యతిరేకం కాదని ఏక్ నాథ్ షిండే వర్గం ప్రకటించింది. ఎంవీఏతో పొత్తు తెగదెంపులు చేసుకుంటే తాము ఉద్ధవ్ తో చర్చలకు సిద్ధమని షిండే శిబిరం ప్రతినిధి దీపక్ కే సర్కార్ ప్రకటించారు. ఇంత జరిగినా ఠాక్రే ఇప్పటికీ మహా వికాస్ అఘాడీతోనే ఉన్నారని అన్నారు. ఠాక్రేకు వ్యతిరేకంగా తాము సుప్రీంకోర్టుకు వెళ్లలేదన్న విషయాన్ని దీపక్ గుర్తు చేశారు. ఉద్దవ్ అంటే తమకు ఇప్పటికీ గౌరవం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే ముంబయిలో ఉన్నారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రాభివృద్ధి కోసమేనని అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సంజయ్ రౌత్ ప్రకటనలపై స్పందించిన దీపక్.. ప్రజల్లో అసంతృప్తిని పెంచేందుకే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఠాక్రేను పదవి నుంచి తొలగించడం తమ ఉద్దేశం కాదని, అందుకే వేడుకల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. తము ఇప్పటికీ శివసేనలోనే ఉన్నామని తేల్చిచెప్పారు. 

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. బల పరీక్ష కంటే ముందే ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. బలం నిరూపించుకోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయంతీసుకోవడం విశేషం.