మార్కెట్ కమిటీ ఏర్పాటుతో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం: మంత్రి వివేక్ వెంకటస్వామి

మార్కెట్ కమిటీ ఏర్పాటుతో  కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం:  మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కష్టపడి పనిచేసేటోళ్లకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది
  • నియోజకవర్గాల పునర్విభజనతో ఆశావహులకు గుర్తింపు, 
  • అవకాశాలు వస్తాయని వెల్లడి
  • పటాన్‌చెరులో అగ్రికల్చర్‌ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

పటాన్‌చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటుతో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం పటాన్‌చెరులో జరిగిన మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు వివేక్‌, దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఆదరిస్తుందని, దానికి నిదర్శనమే ఈ కమిటీల నియామకమని తెలిపారు. పటాన్‌చెరులో పారిశ్రామిక సంస్థల సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌‌) నిధుల వినియోగంలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. , ఈ నెలలోనే నియోజకవర్గాల పునర్విభజనపై చర్చలు జరుగుతాయని, రానున్న రోజుల్లో పార్టీ ఆశావహులకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పిస్తామని వివేక్‌ హామీ ఇచ్చారు.

  • ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి : దామోదర

పటాన్‌చెరు నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో ఇది అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు నియోజకవర్గ బాధ్యుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులకు పటాన్‌చెరు బస్టాండ్ చౌరస్తా వద్ద గజమాలలతో ఘన స్వాగతం పలికారు. 

అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, మార్కెట్ కమిటీ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ యేపూరి శివానందం, వైస్ చైర్మన్ రాజశేఖర్, ఇతర సభ్యులతో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించి, సత్కరించారు. పార్టీ నాయకురాలు నిర్మల జగ్గారెడ్డి, స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.