ఏడు మెడల్స్‌‌తో ఇండియాకు సరికొత్త ఉత్సాహం

ఏడు మెడల్స్‌‌తో ఇండియాకు సరికొత్త ఉత్సాహం
  • సప్త పతక శోభితం

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌: కరోనా ప్రోటోకాల్స్ మధ్యలో.. ఖాళీ స్టేడియాల్లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌‌  ఇండియాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. క్రీడారంగంలో మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసింది.  మీరాబాయి చాను సాధించిన సిల్వర్‌‌ మెడల్‌‌తో టోక్యోలో మొదలైన ఇండియా జర్నీ... నీరజ్‌‌ చోప్రా గెలిచిన గోల్డ్‌‌ మెడల్‌‌తో ముగిసింది. మొత్తంగా ఏడు మెడల్స్‌‌తో గతం కంటే మెరుగ్గా ఒలింపిక్స్‌‌ను ముగించింది. ట్రాక్‌‌ అండ్‌‌ ఫీల్డ్‌‌లో తొలి పతకం, 13 ఏళ్ల తర్వాత ఓ గోల్డ్‌‌ మెడల్‌‌, వెయిట్‌‌ లిఫ్టింగ్‌‌లో తొలిసారి ఓ రజతం, తొమ్మిదేళ్ల తర్వాత బాక్సింగ్‌‌లో ఓ మెడల్‌‌.. వరుసగా రెండు ఒలింపిక్స్‌‌లో మెడల్స్‌‌ గెలిచిన మహిళా అథ్లెట్... మెడల్స్‌‌ సంఖ్యలో రికార్డు..  టోక్యో గేమ్స్‌‌లో ఇండియా సాధించిన ఘనతలివి. మరోపక్క  భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆర్చర్లు, షూటర్లు, పలువురు బాక్సర్లు అట్టర్‌‌ ఫ్లాపవ్వడం తీవ్ర నిరాశపెట్టింది. 

సిల్వర్‌‌తో మొదలు.. గోల్డ్‌‌తో ముగింపు 
టోక్యోలో 18  వేర్వేరు స్పోర్ట్స్‌‌లో 127 మంది అథ్లెట్లు ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు.  పోటీల తొలి రోజే సిల్వర్‌‌ మెడల్‌‌ గెలిచిన వెయిట్‌‌ లిఫ్టర్‌‌ మీరాబాయి చాను..ఇండియాకు అద్భుతమైన ఆరంభం అందించింది. దీంతో ఒలింపిక్‌‌ జర్నీ టాప్‌‌ గేర్‌‌లో మొదలైంది కదా అనుకుంటే షూటర్లు, ఆర్చర్లు.. వరుసపెట్టి విఫలమవుతూ జోష్‌‌ తగ్గించేశారు.15 మంది షూటర్లు బరిలోకి దిగితే సౌరభ్‌‌ ఒక్కడే ఫైనల్‌‌కు చేరడంతో మనోళ్ల ప్రిపరేషన్స్‌‌లో లోపాలు బయటపడ్డాయి. ఇక, మెడల్‌‌ ఖచ్చితంగా తెస్తారనుకున్న ఆర్చర్లు.. ఆటలో గురి తప్పారు. ఇలా మెడల్‌‌ టేబుల్లో కిందకు పడిపోతున్న ఇండియాకు.. స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు ఊపిరి అందించింది. గోల్డ్‌‌ మెడల్‌‌ చాన్స్‌‌ను మిస్‌‌ అయిన హైదరాబాదీ.. బ్రాంజ్‌‌ మెడల్‌‌తో సరిపెట్టింది. కానీ, వరుసగా రెండు ఒలింపిక్స్‌‌లో మెడల్‌‌ గెలిచిన  ఇండియా తొలి మహిళగా నిలిచింది.  మరోవైపు  ఇండియా హాకీ జట్లు(మెన్‌‌, విమెన్స్) చాపకింద నీరులా రేసులో ముందుకొచ్చాయి. ఏకంగా గోల్డ్‌‌ మెడల్‌‌పైనే కన్నేసి.. క్రికెట్‌‌ను ఆరాధించే ఇండియన్స్‌‌ను తమ వైపు చూసేలా చేసుకున్నాయి.  ఇక, స్టార్‌‌ బాక్సర్‌‌ మేరీ కోమ్‌‌ నిరాశపర్చగా..యంగ్​స్టర్​ లవ్లీనా బ్రాంజ్‌‌ మెడల్‌‌ తెచ్చింది. తర్వాతి రోజే ఇండియా ఆనందం రెండింతలైంది. మెన్స్ హాకీ టీమ్‌‌.. బ్రాంజ్‌‌ మెడల్‌‌ సొంతం చేసుకోగా.. కొన్ని గంటల తర్వాత  రెజ్లర్‌‌ రవి దహియా సిల్వర్‌‌ మెడల్‌‌తో ఆనందాన్ని రెట్టింపు చేశాడు.  ఇక, బ్రాంజ్‌‌ మెడల్‌‌ మ్యాచ్‌‌లో పోరాడి ఓడిన విమెన్స్‌‌ హాకీ టీమ్‌‌.. పతకం లేకుండా తిరిగొచ్చినా.. భవిష్యత్తుపై భరోసా కలిగించింది.  అనంతరం స్టార్‌‌ రెజ్లర్‌‌ బజ్‌‌రంగ్‌‌ పునియా బ్రాంజ్‌‌ మెడల్‌‌తో సంతోషం అందిస్తే.. జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా గోల్డెన్‌‌ పంచ్‌‌తో అద్భుతమైన ముగింపు ఇచ్చాడు.  కాగా, ట్రాక్‌‌ అండ్‌‌ ఫీల్డ్‌‌లో ఇండియా పెర్ఫామెన్స్‌‌ గతంలో కంటే ఈసారి మెరుగైందని చెప్పవచ్చు. మన అథ్లెట్లు ముఖ్యంగా స్ప్రింటర్లు.. మెడల్స్‌‌ తీసుకురాకపోయినా చెప్పుకోదగ్గ పెర్ఫామెన్స్‌‌లు ఇచ్చారు.సెయిలర్లు, రోయర్లు కూడా ఫర్వాలేదనిపించగా.. గోల్ఫ్‌‌లో ఇండియా తొలిసారి మెడల్‌‌కు దగ్గరైంది. అదితి అశోక్‌‌ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో మెడల్‌‌ మిస్‌‌ అయ్యింది. కానీ చాలా మందిలో స్ఫూర్తి నింపింది. ఓవరాల్‌‌గా టోక్యో ఒలింపిక్స్‌‌ తర్వాత ఇండియాలో క్రీడా ప్రగతి టాప్‌‌గేర్‌‌ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.