హైటెక్ సిటీలో మరో రవీంద్రభారతి

హైటెక్ సిటీలో మరో రవీంద్రభారతి
  • ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి
  • పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

మాదాపూర్, వెలుగు: పెరుగుతున్న సిటీ అవసరాలకు అనుగుణంగా హైటెక్ సిటీలో రవీంద్రభారతి తరహాలో ఒక అత్యాధునిక కల్చరల్ సెంటర్ నిర్మిస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి దీనిని పూర్తి చేసి కళాకారులకు, ప్రజలకు అంకితం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మాదాపూర్​లోని సీసీఆర్టీలో రూ. 23 కోట్ల వ్యయంతో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్మిస్తున్న ఈ సంగీత నాటక అకాడమీ పనులను శనివారం ఆయన పరిశీలించారు.

ప్రస్తుతం నగరంలో కళాకారుల ప్రదర్శనలకు రవీంద్రభారతి మాత్రమే అందుబాటులో ఉందని, అందుకే ఈ నూతన హాల్​ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, భవిష్యత్తులో ఇది కళాకారులకు, సినిమా కార్యకలాపాలకు అద్భుతమైన వేదికగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైతే అదనపు నిధులు వెచ్చించి ఈ కేంద్రాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.