V6 News

ఉపాధిలో కొత్త రూల్! ఇక మొబైల్ యాప్తోనే మస్టర్!

ఉపాధిలో కొత్త రూల్! ఇక మొబైల్ యాప్తోనే మస్టర్!
  • అండ్రాయిడ్ ఫోన్, 2 జీబీ స్టోరేజ్ ఉంటే చాలు  
  • ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక మేట్ నియామకం
  • ఇందులో సగం మేట్లు మహిళలకే కేటాయింపు 


హైదరాబాద్​, వెలుగు: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు చెక్​పెట్టేందుకు రాష్ట్ర సర్కార్​ కొత్త రూల్​ తీసుకొచ్చింది. ఇక నుంచి మొబైల్ యాప్ ద్వారానే మస్టర్​(రిజిస్టర్​)లో కూలీల హాజరును పక్కాగా నమోదు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో మొబైల్ ఫోన్లు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మేట్స్ నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 

పాత పద్ధతికి స్వస్తి చెబుతూ.. యాప్ ఆధారిత హాజరు, ముఖ గుర్తింపు విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. నూతన పంచాయతీల్లో మేట్స్​ను గుర్తించే బాధ్యతను సెక్రటరీలకు అప్పగించగా, ఏపీవో పర్యవేక్షణలో ఎంపికలు చేయనున్నారు. ఎంపికయ్యే మేట్లలో సగం మంది (50 శాతం) మహిళలు ఉండేలా నిబంధనలు విధించారు. ప్రతి ఆవాస ప్రాంతానికి కనీసం ఒక మేట్ ఉండాలి. వీరు తమ పరిధిలోని 40 నుంచి 50 మంది కూలీల హాజరును పర్యవేక్షించాల్సి ఉంటుంది. 

  • స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. 

మేట్లుగా ఎంపికయ్యేటోళ్లకు కనీస సాంకేతిక తెలివితేటలు ఉండాలి. అండ్రాయిడ్ వెర్షన్ 7 అంతకంటే ఎక్కువ ఉన్న ఫోన్ ఉండాలి. ఫోన్ల కనీసం 2 జీబీ ఖాళీ స్టోరేజ్ తగినంత ర్యామ్ ఉండటం తప్పనిసరి. ఎంపికైన మేట్ల వివరాలను, వాళ్ల ఫోన్ ఐడీలను 'ఎన్​ఆర్​ఈజీఏఎస్​ సాఫ్టు' పోర్టల్‌‌లో నమోదు చేసి.. యాప్ ఎట్లా వాడాలో ట్రైనింగ్ ఇస్తారు. 

పల్లెటూర్లలో సిగ్నల్ ప్రాబ్లంతో హాజరు నమోదుకు ఇబ్బందిగా మారుతుందని గ్రహించిన సర్కార్... యాప్‌‌లో 'ఆఫ్‌‌లైన్ మోడ్' సదుపాయాన్ని కల్పించింది.  నెట్‌‌వర్క్ ఉన్న కాడ డేటా డౌన్‌‌లోడ్ చేసుకొని, ఫీల్డ్​కు పోయాక కూలీల ఫొటోలు, అటెండెన్స్ తీసుకోవచ్చు. మస్టర్ టైమ్ అయిపోయేలోపు ఎక్కడో ఒక దగ్గర నెట్ దొరికినప్పుడు అప్‌‌లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే ఫోటోలు తీసేటప్పుడు మాత్రం 'పోర్ట్రెయిట్' మోడ్‌‌లోనే తీయాలని అధికారులు చెప్తున్నారు.  

  • సమస్య వస్తే స్క్రీన్ షాట్ తీయాల్సిందే..

యాప్‌‌లో ఏమైనా సమస్యలొస్తే మేట్లు వెంటనే ఏపీఓలకు చెప్పాలి. ఏపీఓలు పరిష్కరించలేకపోతే జిల్లా రిసోర్స్ పర్సన్లకు, ఆ పైన స్టేట్ టెక్నికల్ టీమ్‌‌కు పంపిస్తారు. అయితే, సమస్య ఏందో చెప్పేటప్పుడు మాత్రం కచ్చితంగా స్క్రీన్ షాట్లు, వీడియోలు తీసి పంపాలని అధికారులు నిబంధన పెట్టారు. ఈ కొత్త పద్ధతితో ఉపాధి పనుల్లో డబ్బుల గోల్‌‌మాల్ ఆగుతుందని సర్కార్ భావిస్తోంది.