వీడియో కాలింగ్ కంపెనీలకూ టెలికాం లైసెన్స్ ?

వీడియో కాలింగ్ కంపెనీలకూ టెలికాం లైసెన్స్ ?

మరో 6 నుంచి 10 నెలల్లోగా పార్లమెంటు ముందుకు నూతన టెలికాం బిల్లు రానుంది. ఈ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం డ్రాఫ్ట్ బిల్లును కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విడుదల చేశారు. నూతన టెలికాం బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం తొందరపడడం లేదని ఆయన స్పష్టంచేశారు. ప్రజాభిప్రాయ సేకరణ, విస్తృత సంప్రదింపుల తర్వాతే తుది డ్రాఫ్ట్ ను రూపొందిస్తామని తెలిపారు. తుది డ్రాఫ్ట్ ను తొలుత పార్లమెంట్ కమిటీకి పంపుతామని, ఆ తర్వాతే పార్లమెంట్లో ప్రవేశపెడతామన్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఇండియన్ వైర్ లెస్ టెలీగ్రఫీ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (చట్టవిరుద్ధ స్వాధీనం) యాక్ట్ 1950 స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు చెప్పారు.

అక్టోబరు 20లోపు నూతన టెలికాం బిల్లుపై  ప్రజాభిప్రాయం సేకరిస్తామన్నారు. ఇంటర్నెట్ ద్వారా ఆడియో కాలింగ్, వీడియో కాలింగ్, మెసేజింగ్ సేవలు అందిస్తున్న వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యూయో, , ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు సైతం ఇకపై దేశీయంగా టెలికాం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ఫీజులు, అపరాధ రుసుముల్ని మాఫీ చేసే నిబంధనను సైతం బిల్లులో ప్రతిపాదించారు. టెలికాం కంపెనీలు లైసెన్సులను సరెండర్ చేస్తే.. రుసుములు వెనక్కి తిరిగి ఇచ్చే ప్రతిపాదన కూడా నూతన బిల్లులో ఉంది.