సూపర్ పోలీసింగ్..! పీస్ఫుల్గా న్యూఇయర్ సెలబ్రేషన్స్.. పక్కా ప్లాన్తో జీరో ఇన్సిడెంట్ ఫ్రీ ఇయర్ ఎండ్

సూపర్ పోలీసింగ్..! పీస్ఫుల్గా న్యూఇయర్ సెలబ్రేషన్స్.. పక్కా ప్లాన్తో జీరో ఇన్సిడెంట్ ఫ్రీ ఇయర్ ఎండ్
  • ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు క్లోజ్
  • ముందస్తు డ్రంక్​ అండ్​ డ్రైవ్​తో తగ్గిన యాక్సిడెంట్స్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2026కు మహానగరం ప్రశాంతంగా స్వాగతం పలికింది. మన సూపర్​పోలీసింగ్​తో రోడ్డు ప్రమాదాలు కానీ, ఇతర ఇన్సిడెంట్లు కానీ జరగలేదు. న్యూ ఇయర్ వేడుకల్లో కూడా అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు. పోలీసుల ముందస్తు చర్యలు, పటిష్ఠ బందోబస్తు, ప్రజల అవగాహనతో కొత్త సంవత్సరం వేడుకలు పీస్​ఫుల్​గా ముగిశాయి.  

వారం ముందు నుంచే డ్రంక్​ అండ్​ డ్రైవ్​ 

కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు పక్కా ప్లాన్​తో పని చేశారు. ఇయర్​ఎండ్​కు వారం ముందు నుంచే డ్రంక్​అండ్​డ్రైవ్​తనిఖీలు మొదలుపెట్టారు. 31న నాలుగు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో పాయింట్లు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉన్న ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, సెక్రటేరియేట్​వంటి కీలక ప్రాంతాల్లో ప్రవేశాలను నిషేధింంచారు. 

పబ్‌లు, హోటల్స్, ఈవెంట్ వేదికల దగ్గర పోలీసు సిబ్బందిని పెంచారు. ఫలితంగా న్యూఇయర్ రాత్రి ఎలాంటి  ప్రమాదాలు కనిపించలేదు.  ఈ సందర్భంగా సిటీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. ‘హైదరాబాద్ సురక్షిత నగరంగా మరోసారి నిరూపితమైంది. వేడుకలు ఆనందంగా జరిగాయి’ అని యంత్రాంగాన్ని అభినందించారు. 

సహకరించిన గిగ్​ వర్కర్స్.. 

పోలీసులతో పాటు ప్రజలు, వివిధ సంస్థలు చూపిన సహకారం కొత్తసంవత్సరం ప్రశాంత వాతావరణానికి ముఖ్య కారణం. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్  ఆధ్వర్యంలో డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 1 గంట వరకు ఉచిత క్యాబ్, ఆటో, ఈవీ బైక్ సర్వీసులు అందుబాటులో ఉంచారు. సుమారు 500 వాహనాలతో ఈ సేవను నిర్వహించిన యూనియన్.. మద్యం సేవించినవారు సురక్షితంగా ఇంటికి చేరుకునేలా సహాయం చేసింది. మందుబాబులు ఈ ఉచిత సర్వీసులను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. 

అలాగే, ఆటో, టూ-వీలర్ డ్రైవర్లు పూర్తి సహకారం అందించారు. న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులు ప్రతి వేదిక వద్ద క్యాబ్ సర్వీసులు ఏర్పాటు చేయడంతో, ఎక్కువ మంది సేఫ్టీ రైడ్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణ క్యాబ్ సర్వీసులు కూడా రాత్రంతా అందుబాటులో ఉండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయి. 

ట్రాఫిక్ ఆంక్షలు.. పబ్లిక్ ప్లేసుల్లో  నిఘా

వేడుకల నేపథ్యంలో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.  ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్‌టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ వంటి పబ్లిక్ ప్లేస్‌ల్లో పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టారు. రాత్రి 11 గంటల నుంచి మార్గల్లోకి ప్రైవేటు, పబ్లిక్ వాహనాలకు అనుమతించలేదు.  నగరంలోని బేగంపేట, టోలిచౌకీ తప్ప మిగతా అన్ని ఫ్లైఓవర్లు మూసివేశారు.  పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ శంషాబాద్​ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే విమాన టికెట్లు ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంచి అనవసరపు డ్రైవింగ్స్​ను కంట్రోల్​ చేశారు. 

వీవీ స్టాచ్యూ, సెక్రటేరియట్ జంక్షన్, ఖైరతాబాద్ గణేష్, ఇక్బాల్ మీనార్ వంటి ప్రాంతాల నుంచి వాహనాలు షాదాన్ కాలేజీ, లిబర్టీ, రణిగంజ్ వైపు డైవర్ట్ చేసి ట్రాఫిక్​ సమస్య లేకుండా చూశారు.  దీంతోపాటు  నగరంలో 217 కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు డిప్లాయ్ చేశారు.