V6 News

రాష్ట్రంలో ‘న్యూకాజిల్’ వర్సిటీ ఆఫ్‌‌ క్యాంపస్‌‌?... టీజీసీహెచ్‌‌ఈ చైర్మన్‌‌తో యూకే బృందం భేటీ

రాష్ట్రంలో ‘న్యూకాజిల్’ వర్సిటీ ఆఫ్‌‌ క్యాంపస్‌‌?... టీజీసీహెచ్‌‌ఈ చైర్మన్‌‌తో యూకే బృందం భేటీ
  •     ఏఐ, డేటా సైన్స్ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఉన్నత విద్యను గ్లోబల్ స్టాండర్డ్స్‌‌కు తీసుకెళ్లే దిశగా మరో ముందడుగు పడింది. యూకేకు చెందిన ప్రముఖ ‘న్యూకాజిల్ యూనివర్సిటీ’ ప్రతినిధి బృందం బుధవారం తెలంగాణ హయ్యర్  ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డితో భేటీ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇన్నోవేషన్, అగ్రో బిజినెస్, హెల్త్‌‌కేర్ ప్రోగ్రామ్స్‌‌లో పరస్పర సహకారంపై చర్చించారు. న్యూకాజిల్ యూనివర్సిటీకి ఇప్పటికే సింగపూర్, మలేషియాలో ఆఫ్ క్యాంపస్‌‌లు ఉన్నాయని, త్వరలో భారత్‌‌లోనూ తమ ఆఫ్ క్యాంపస్‌‌ను ఏర్పాటు చేసేందుకు వివిధ నగరాలను పరిశీలిస్తున్నామని ప్రతినిధి ప్రొఫెసర్ స్టీవర్ట్ రాబిన్సన్  చైర్మన్‌‌కు వివరించారు. 

ఈ క్రమంలో తెలంగాణలోని అనుకూలతలను స్టడీ చేస్తున్నట్టు వివరించారు. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో సాధిస్తున్న పురోగతిని యూకే బృందానికి వివరించారు. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యాబోధనలో తెచ్చిన మార్పులను ప్రస్తావించారు. నైపుణ్యాధారిత కోర్సులు, స్ట్రక్చర్డ్ ఇంటర్న్‌‌షిప్స్, అకడమిక్ కొలాబరేషన్స్, ఏఐ ట్యూటర్స్, కోడింగ్ అసిస్టెన్స్ వంటి కొత్త విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాబోయే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, నెట్ జీరో గోల్స్, రైజింగ్ తెలంగాణ విజన్ 2047 వంటి అంశాల్లో విదేశీ వర్సిటీల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య నారాయణ్ శర్మ, బారీ హాడ్గ్సన్, సంజన మేడిపల్లి ఉన్నారు.