- సీబీఎస్ఈ, కేంద్ర విద్యాశాఖతో సహా అన్ని రాష్ట్రాలకు ..
- ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు
- పలానా చోటే కొనాలని పేరెంట్స్‌ను బలవంతం చేస్తున్న స్కూళ్లపై సీరియస్
న్యూఢిల్లీ, వెలుగు: కొన్ని స్కూల్స్ ప్రైవేట్ ప్రచురణ కర్తల నుంచి ఖరీదైన పుస్తకాలను కొనాలని సూచిస్తున్నాయనే ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో కేంద్ర విద్యాశాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే 30 రోజుల్లో పాఠ్యపుస్తకాల జాబితాలపై దేశవ్యాప్త ఆడిట్ కు ఆదేశించింది.
ఏప్రిల్ 9వ తేదీన అందిన ఈ కంప్లైట్స్, మీడియా కథకాలపై తాజాగా ఎన్ హెచ్ ఆర్సీ స్పందించింది. రేట్లు అధికంగా ఉన్న ప్రచురణ సంస్థల నుంచి పుస్తకాలు కొనుగోలు చేయాలని తమను స్కూళ్లు బలవంతం చేస్తున్నాయని, ప్రతి సంవత్సరం సవరిస్తున్న ఈ పుస్తకాల వల్ల తమపై ఆర్థిక భారం పడుతున్నదని తల్లిదండ్రులు లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఎన్ హెచ్ ఆర్సీ సభ్యులు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలో విచారణ చేపట్టగా పలు కీలక అంశాలు బయటపడ్డాయి. ప్రైవేట్ స్కూల్స్ సూచిస్తున్న ఈ ఖరీదైన పుస్తకాలు తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడంతో పాటు విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ఉన్నాయని తేలింది.
విద్యా హక్కు ఉల్లంఘనే..
ఈ పరిస్థితులు బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు(ఆర్టీఈ) చట్టం ఉల్లంఘనలను సూచిస్తున్నదని ఎన్ హెచ్ ఆర్సీ పేర్కొంది. ఈ చట్టంలోని సెక్షన్ 29 ప్రకారం.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సీఈఆర్టీ) వంటి నియమిత విద్యా అధికార సంస్థలే పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాలను రూపొందించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ప్రైవేట్ పుస్తకాలను సూచించడం అంటే కుటుంబాలపై అదనపు భారాన్ని మోపడమేనని, ఇది ఉచిత, సమానమైన ప్రాథమిక విద్యాహక్కు చట్టం ఉద్దేశాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది. ఇది జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ )–2020 లక్ష్యాలను నీరుగార్చే ప్రమాదం ఉందని తెలిపింది.
రెండంచెల విద్యా వ్యవస్థ ఏర్పడే ప్రమాదం
స్కూళ్లు అనేక ప్రైవేట్ ప్రచురణలను సూచించడం వల్ల పిల్లల బ్యాగ్ ల బరువు పెరిగి, వారి ఆరోగ్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎన్ హెచ్ ఆర్సీ తెలిపింది. ఇది జాతీయ విధానాన్ని ఉల్లంఘించడమే అవుతుందని గుర్తు చేసింది. ఇటువంటి వాణిజ్య ప్రయోజనాలతో ‘రెండు అంచెల విద్యా వ్యవస్థ’ ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ విషయంలో ఆర్టీఈ నిబంధలను పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని, 30 రోజుల్లో నిర్దేశిత పుస్తకాలను స్కూల్స్ వారీగా ఆడిట్ చేయాలని రాష్ట్రాలను కోరింది. అలాగే ఎన్సీఈఆర్టీ వంటి సంస్థల పాత్ర, ప్రాథమిక స్థాయిలో పరీక్షా బోర్డులకు ఏమైనా అధికార పరిధి వంటి అంశాలపై 15 రోజుల్లో స్పష్టత ఇవ్వాలని కేంద్ర విద్యా శాఖను కోరింది.

