- కీలక పత్రాలు, బ్యాంకు పాస్బుక్లు, డైరీలు స్వాధీనం
- గత నెల మావోయిస్టు పార్టీ నేత రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఇన్నయ్య
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపణలు
బచ్చన్నపేట, వెలుగు: సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో మంగళవారం నేషనల్ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం సాగరంలోని ఇన్నయ్య ఇంటితోపాటు జాఫర్గడ్లోని ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఒకేసారి తనిఖీలు చేపట్టారు. ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 5.40 వరకు సోదాలు కొనసాగాయి.
మావోయిస్టు పార్టీ అగ్రనేత కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఇన్నయ్య.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో గత డిసెంబర్ 21న పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో భాగంగా ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో తనిఖీలు చేసినట్టు సమాచారం. ఆశ్రమంలోకి వెళ్లిన వెంటనే అధికారులు పిల్లల దగ్గరున్న సెల్ ఫోన్లు లాక్కున్నారు.
ఆఫీస్లో అమరవీరుల బంధుమిత్రుల కమిటీకి చెందిన కీలక పత్రాలు, బ్యాంకు పాస్బుక్లు, డైరీలు, ఐఫోన్, ల్యాప్లాప్లు, భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. గతంలో ఇన్నయ్య ఇంటికి, ఆశ్రమానికి వచ్చిపోయిన వారి వివరాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేకంగా సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇన్నయ్య తల్లిదండ్రుల వద్ద రూ.లక్ష నగదును అధికారులు సీజ్ చేశారు. అవి భూమి కౌలు డబ్బులని చెప్పినా వినలేదని వారు వాపోయారు.
