Swayambhu Teaser: ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు.. ‘స్వయంభు’ టీజర్‌లో నిఖిల్ విశ్వరూపం!

Swayambhu Teaser: ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు.. ‘స్వయంభు’ టీజర్‌లో నిఖిల్ విశ్వరూపం!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పీరియాడికల్ చిత్రం 'స్వయంభు'.  'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు మరో సారి బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు. లేటెస్ట్ గా 'స్వయంభు' మూవీకి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను సరికొత్త చారిత్రక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఆకట్టుకుంటోంది.

యుద్ధభూమిలోకి..

దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం క్రీస్తుశకం 985 నాటి కథాంశంతో సాగుతుంది. టీజర్‌లో నిఖిల్ లుక్ చూస్తుంటే, ఆయన ఈ పాత్ర కోసం ఎంతలా శ్రమించారో స్పష్టమవుతోంది. ఒక పరాక్రమవంతుడైన యోధుడిగా నిఖిల్ మేకోవర్, ఆరడుగుల ఆజానుబాహుడిలా కనిపిస్తూ శత్రువుల సంహారం చేసే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. యుద్ధరంగంలో ఆయన ప్రదర్శించిన కత్తిసాము, అశ్వారోహణ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

 వెన్నులో వణుకు పుట్టించేలా..

‘స్వయంభు’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక దృశ్య కావ్యంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం టాలీవుడ్‌లో దిగ్గజ సాంకేతిక నిపుణులు పనిచేశారు.  ‘మగధీర’, ‘బాహుబలి’, ‘RRR’ వంటి విజువల్ వండర్స్‌ను అందించిన సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.  ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో తన మ్యూజిక్ పవర్‌ను చూపించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. టీజర్‌లోని నేపథ్య సంగీతం వెన్నులో వణుకు పుట్టించేలా ఉండి, సినిమా స్థాయిని పెంచింది.

సమ్మర్ కానుకగా.. 

ఈ భారీ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరి పాత్రలు కూడా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో కీలక మలుపులుగా ఉంటాయని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 3D ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తుందని టీజర్ భరోసా ఇచ్చింది. భారీ సెట్టింగ్‌లు, వేలమంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయి.

సమ్మర్ కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ‘స్వయంభు’, నిఖిల్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడమే కాకుండా, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతుందనడంలో సందేహం లేదంటుని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. టీజర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ యోధుడు, వెండితెరపై ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి మరి.