మూడేండ్లలో 2 లక్షల కోట్లతో రోడ్లు, బ్రిడ్జిలు : కేంద్ర మంత్రి నితిన్ ​గడ్కరీ

 మూడేండ్లలో 2 లక్షల కోట్లతో రోడ్లు, బ్రిడ్జిలు : కేంద్ర మంత్రి నితిన్ ​గడ్కరీ
  • తెలంగాణ రూపురేఖలు మార్చి చూపిస్తం: కేంద్ర మంత్రి నితిన్ ​గడ్కరీ
  • ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధి న్యూస్​ రీల్ ​మాత్రమే 
  • అసలు సినిమా ముందున్నది
  • ఆరు లేన్లుగా హైదరాబాద్– నాగ్​పూర్​ హైవేను విస్తరిస్తం
  • 10 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్​ను పూర్తిచేస్తం
  • సాగునీటి ప్రాజెక్టుల్లో పూడిక తీసి హైవేల్లో వాడుతం 
  • ఇథనాల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచన 
  • కుమ్రం భీం ఆసిఫాబాద్​లో రూ. 3,900 కోట్లతో చేపట్టిన  హైవేలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన
  • అంబర్​పేట్, బీహెచ్ఈఎల్​ ఫ్లైఓవర్​ను ప్రారంభించి, జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి

హైదరాబాద్ / అసిఫాబాద్ / రామచంద్రాపురం/ షాద్ నగర్, వెలుగు: ఇప్పుటివరకూ జరిగిన అభివృద్ధి న్యూస్ రీల్ మాత్రమేనని, అసలు సినిమా ముందున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ అన్నారు. మూడేండ్లలో రూ. 2 లక్షల కోట్లతో  రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించి..  తెలంగాణ రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు.  రాష్ట్రంలో రూ. లక్ష కోట్లతో గ్రీన్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. దేశంలో హైవే ల నిర్మాణం వల్ల  జర్నీ సమయాన్ని సగానికి తగ్గించామని, రవాణా ఖర్చు, వాహనాల లైఫ్ పెరిగిందని పేర్కొన్నారు. సోమవారం  కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నితిన్​గడ్కరీ రూ. 3,900 కోట్లతో చేపట్టిన హైవే పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.  

రూ. 3,526 కోట్లతో  మంచిర్యాల నుంచి  మహారాష్ట్ర సరిహద్దు వరకు నాలుగు లేన్ల నేషనల్​ హైవేను,  రూ. 127 కోట్లతో  నిర్మించిన నిర్మల్, ఖానాపూర్ సెక్షన్ లో రెండు లేన్ల  పేవ్డ్ షోల్డర్ రహదారిని, ఎన్​హెచ్​–44 పరిధిలో  రూ. 29 కోట్లతో  నిర్మించిన  అండర్ పాస్,  రూ.18 కోట్లతో వేసిన సర్వీస్ రోడ్లు, జంక్షన్లను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. రూ. 173 కోట్లతో నాగ్​పూర్,  హైదరాబాద్ సెక్షన్ లో 4 అండర్ పాస్ లు, సర్వీస్ రోడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి,  రూ. 29 కోట్లతో  ఆర్మూర్-–జగిత్యాల-–మంచిర్యాల సెక్షన్ లో 4 లేన్ల హైవే విస్తరణకు  శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద  నిర్వహించిన బహిరంగ సభలో గడ్కరీ  మాట్లాడారు.  సాగునీటి ప్రాజెక్టుల్లో పూడిక తీసి,  ఆ మట్టిని హైవేల్లో వాడుతామని,  దీనివల్ల అటు భూగర్భ జలాలు పెరుగుతాయని, ఇటు రోడ్లు బాగవుతాయని తెలిపారు. 

రహదారుల అభివృద్ధి ఘనత మోదీదే

సాగునీరు ఎంత ఎక్కువగా ఉంటే  అభివృద్ధి అంత బాగుంటుందని,  తెలంగాణలో  చెరువులు, ప్రాజెక్టు , కుంటల్లో పూడిక తీసి వాటిని అమృత్ సరోవరాలుగా మారుస్తామని గడ్కరీ తెలిపారు.  ఇందుకయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం  సహకరిస్తే  ఒక్క చుక్క  వృథా కాకుండా  నీటిని  సాగుకు వాడుకోవచ్చన్నారు.  నేషనల్​ హైవేల  నిర్మాణం ద్వారా నీటిని సంరక్షించే పద్ధతి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.  

 రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని  గడ్చిరోలి  జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, అదే విధానం తెలంగాణలో ముఖ్యంగా..  కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అమలు చేస్తామన్నారు. డబ్బులు డిపాజిట్ చేసుకున్నట్టు నీటిని కూడా డిపాజిట్ చేయాలని సూచించారు.  తెలంగాణలో రహదారుల అభివృద్ధి ఘనత  ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌, మంచిర్యాల, భూపాలపల్లి మీదుగా విజయవాడకు హైవే  వస్తుందని, మేడారం జాతర రోడ్డును  విస్తరిస్తామని చెప్పారు.  హైదరాబాద్– నాగ్​పూర్ నేషనల్​ హైవేను  ఆరు లేన్లుగా విస్తరిస్తామని తెలిపారు.  మాజీ  ప్రధాని  వాజ్​పేయి చొరవతో  ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన వచ్చిందని, దీంతో   దేశంలో  నాలుగున్నర లక్షల గ్రామాలకు రోడ్లు వేశామని చెప్పారు.  

రూ. 2,200 కోట్లతో మల్టీమోడల్ లాజిస్టిక్స్​

హైదరాబాద్ లో 2,200 కోట్ల తో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ నెలకొల్పనున్నట్లు గడ్కరీ ప్రకటించారు.  వ్యవసాయంలో డీజిల్, పెట్రోల్ వాహనాలు, పరికరాలకు బదులు  ఎలక్ట్రిక్ వాహనాలు , పని ముట్లు తయారు చేయాలని సంబంధిత  కంపెనీలతో మాట్లాడానని,  ఇప్పటికే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపొందించారని తెలిపారు. ఈ ట్రాక్టర్​ను  తాను వ్యవసాయంలో  వాడుతున్నానని,  తాను వినియోగించే అన్ని వాహనాలు సీఎన్​జీ, ఎలక్ట్రిక్ వేనని, అందరూ ఈ వాహనాలనే  వాడాలని సూచించారు.  తాను  ఇంజనీర్​ని కాకపోయినా 13 పీహెచ్ డీ లు వచ్చాయని,  ఇందులో 7  వ్యవసాయం , నీటి సంరక్షణ లోనే వచ్చాయని వెల్లడించారు. 

 తనకు వ్యవసాయం అంటే ఇష్టమని, తాను అందుబాటులో లేకపోతే తన భార్య పంటలను చూసుకుంటుందని చెప్పారు. వెనుకబడిన గడ్చిరోలి జిల్లాను దత్తత తీసుకుని వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ  గడ్డం వంశీ కృష్ణ , ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ , ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, వెడ్మ బొజ్జుపటేల్, హరీశ్ బాబు, రామారావు పటేల్ , స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే , అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ డీవీ శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు. 

అభివృద్ధి చేసుకుందాం: బండి సంజయ్​

 రాజకీయ విమర్శలు మాని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోడెద్దుల్లా కలిసి పని చేద్దామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.  మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత   తెలంగాణలో నేషనల్​ హైవేలు 2,500 కిలోమీటర్ల నుంచి  5,200 కిలోమీటర్ల కు పెరిగాయని చెప్పారు. నితిన్​గడ్కరీ మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ఏ పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లినా పని చేస్తారని చెప్పారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సీతక్క మంచివాళ్లని కొనియాడారు.  హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారిని  మరమ్మతు  చేయాల్సిన అవసరం ఉందని,  మంత్రి కోమటిరెడ్డి చొరవ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించాలని,  కాంట్రాక్టర్ తో ఉన్న సమస్య పరిష్కరిస్తే దీన్ని నేషనల్ హైవే గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.    

దేశంలో 83 కోట్ల మందికి ఉచిత రేషన్: కిషన్​రెడ్డి

దేశంలో 83 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. పసుపు రైతుల కోసం  నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు.   కాశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే లైన్ వేసిన ఘనత నరేంద్ర మోదీదేనని అన్నారు. వరంగల్ జిల్లా ఖాజీపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రామగుండంలో వంద మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు , ములుగు జిల్లాలో  సమ్మక్క- సారక్క గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేశామని తెలిపారు. 

ఆదిలాబాద్​లో డిఫెన్స్ ఎయిర్​పోర్ట్  ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ ను దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు  అనుసంధానం చేశామని వివరించారు.   హైదరాబాద్‌‌లో  బాంబే హైవే ఫ్లై ఓవర్, ఆరంఘర్  ఫ్లైఓవర్, అంబర్ పేట్ ఫ్లైఓవర్ వంటి మల్టీలెవెల్ ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తాను ఎమ్మెల్యేగా  ఉన్న సమయంలో అంబర్ పేట్ ఫ్లైఓవర్ కోసం ఎంతో కష్టపడి సాధించానని, ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్ల కోసం 6 చోట్ల భూసేకరణ ఇంకా పెండింగ్‌‌లో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని ఈ భూసేకరణను పూర్తిచేయాలని కిషన్ రెడ్డి కోరారు.  

ఫారెస్ట్ అనుమతులు ఇబ్బందిగా మారాయి: సీతక్క

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు  కనెక్టివిటీకి  అటవీ అనుమతులు ఇబ్బందిగా మారాయని మంత్రి సీతక్క చెప్పారు.  ఆదివాసీ గ్రామాలకు  రోడ్లు, బ్రిడ్జిల కోసం  ఫారెస్ట్  క్లియరెన్స్ లు ఇవ్వడం లేదని, కేంద్ర మంత్రి చొరవ తీసుకొని అనుమతులు ఇప్పించాలని  కోరారు.  నితిన్ గడ్కరీ మంచి విజన్ ఉన్న నాయకుడని,  ఆయన ముందుచూపుతో దేశంలో నేషనల్ హైవే లు వేగంగా నిర్మాణమవుతున్నాయని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేశామని చెప్పారు.  

 బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన ​గడ్కరీ

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని బీహెచ్ఈఎల్​ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్​ను కేంద్ర  మంత్రి నితిన్ గడ్కరీ   ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. రూ. 172 కోట్లతో 1.6 కిలోమీటర్ల పొడవున 6 లేన్లతో  ఈ ఫ్లై ఓవర్​ను నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.  కాగా,  నేషనల్ హైవేల​ విస్తరణలో భాగంగా పటాన్​చెరులో కూడా ఫ్లై ఓవర్​ నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. అలాగే, కొత్తగా నిర్మించిన బీహెచ్ఈల్​ ఫ్లై ఓవర్​ను కనెక్ట్ చేస్తూ అమీన్​పూర్​ నుంచి లింగంపల్లికి లింక్​ రోడ్డు మంజూరు చేయాలని గడ్కరీని అమీన్​పూర్​ మున్సిపాలిటీ మాజీ చైర్మన్​ పాండురంగా రెడ్డి  కోరారు.  

 కన్హాలో బయోచార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్..

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చేగూర్ కన్హా శాంతి వనంలో బయోచార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రంను  గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు దాజీ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, తదితరులు హాజరయ్యారు..ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ..  రైతులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు.  బయోచార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను గ్రామీణ ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  

గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించారు.  హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై మాట్లాడారు.  ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన ట్రిపుల్​ఆర్​ నార్త్ పార్ట్ కు  వీలైనంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని   కోరారు.  రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ తోపాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని విన్నవించారు. 

ఎన్ హెచ్ -765 లోని హైదరాబాద్- -,శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని,  హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే ను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. హైదరాబాద్-డిండి-మన్ననూర్, హైదరాబాద్-మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే, ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధి పనులను వెంటనే మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో మంత్రులు వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్​ పాల్గొన్నారు.

అంబర్​పేట్ ​ఫ్లైఓవర్​ ప్రారంభం

 హైదరాబాద్​లోని అంబర్ పేటలో గోల్నాక ఫ్లై ఓవర్ ను ప్రారంభించటంతోపాటు పలు ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపనలు చేశారు.  అనంతరం అంబర్ పేట ఎంసీహెచ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గడ్కరీ ప్రసంగించారు.  ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను10 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని    ప్రకటించారు.  టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు నిదానంగా చేస్తున్నందున పనులు వేగంగా చేసేందుకు కాంట్రాక్టర్ ను  మార్చామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 

రాష్ట్రంలో నేషనల్ హైవేల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తున్నదని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు వేగంగా భూసేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. హైదరాబాద్- –-విజయవాడ  హైవే ను  ఇప్పుడున్న 4 లేన్స్​ నుంచి 6 లేన్లుగా అభివృద్ధి చేస్తామని, హైదరాబాద్-- –శ్రీశైలం మార్గాన్ని కూడా 4  లేన్స్​గా విస్తరిస్తామని ప్రకటించారు.  హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల్లో రోజురోజుకూ పురోగతి సాధిస్తున్నదని చెప్పారు. దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ లో ఉంటున్నారని అన్నారు. హైదరాబాద్ ను దేశంలోని వివిధ నగరాలతో కలిపేలా రహదారులు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. 

అలాగే, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా రీజినల్ రింగ్ రోడ్డు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. నాగ్​పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ ను హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని  రాష్ట్ర మంత్రులకు సూచించారు. అలాగే, కాలుష్యాన్ని తగ్గించే విధంగా సీఎన్​జీ, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో తామంతా కట్టుబడి ఉన్నామని గడ్కరీ తెలిపారు.