‘చింతల చేను’ నవలలో విభిన్న పార్శ్వాలున్న జీవిత కథలు మనకు ఎన్నో తారసపడతాయి. ఒకరిలా మరొకరు కనిపించరు. ఒకరిలా మరొకరు ఆలోచించరు. ఎవరి ప్రయోజనాలు వారివి. అలానే ఎవరి స్వార్థాలు వారివి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో.. పల్లెటూరి జీవన శైలిని పరిచయం చేస్తూ.. ఒక్కో పాత్రను ఒక్కో కోణంలో చూపిస్తూ.. సగటు రైతు జీవితం చుట్టూ సాగే ఒక యథార్థ గాథే ఇది.
ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టరు కొనుక్కుంటే తన ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందనుకునే ఇంటి యజమాని గుణశేఖరుడు.. అతడి తల్లి నారాయణమ్మ, భార్య హైమావతి, కొడుకు బాలాజీల చుట్టూ సాగే ఈ కథలో.. వారి ఆశలు, ఆలోచనలు, కలల రూపమే ఈ నవల. మారుతున్న గ్రామీణ జీవనశైలి అలానే ప్రకృతితో మనిషికున్న అనుబంధం.. నేటి ఆర్థిక, సామాజిక సంఘర్షణలను, సామాన్య ప్రజల జీవిత అనుభవాలను సహజశైలిలో ఆవిష్కరించింది.
ఇదొక కరువు కథ. నిత్య జీవన పోరాటం సాగిస్తున్న ఓ సగటు రైతు కథ. తనకున్న చింతచేను కాస్త చింతల చేనుగా మారిన కథ. ట్రాక్టర్ కొంటే బతుకులు మారతాయని నమ్మి, అప్పు చేస్తే, తెచ్చిన ట్రాక్టర్ జప్తులోకి పోయి.. అప్పులపాలైన ఓ రైతు వ్యథ.
ట్రాక్టర్ కొనుక్కోవడానికి అప్పిచ్చిన సిద్ధిరాజు, అతడితో ట్రాక్టరు ఇన్సూరెన్స్ చేయించాలని చూసే వెంకటముని, ట్రాక్టర్‌కి పని కల్పించి సొమ్ము చెల్లించిన ఏలుమలై, సొమ్ము సగం మాత్రమే చెల్లించిన సుబ్బరాముడు, సొమ్ము చెల్లించలేకపోయిన నరసరాజు ఈ కథలోని మరిన్ని ముఖ్యమైన పాత్రలు.
కల్తీ ఎరువులు, విత్తనాల వల్ల ప్రాణాలు కోల్పోయిన రైతుల విషాద కథల్నే కాకుండా.. భూమిని నమ్ముకున్న రైతు, రైతును నమ్ముకున్న ఇతర వృత్తులవాళ్ళు కూడా నిలువునా మునిగిపోతున్నారనే పచ్చి వాస్తవాన్ని ఈ నవల గొప్పగా ఆవిష్కరించింది. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా తగిలే కరవు దెబ్బను మన కళ్లకు కట్టినట్లు చూపించింది కూడా.
ఒకరి దగ్గర పని చేసిన స్థాయి నుంచి ఒకరికి పని ఇచ్చే స్థాయికి వెళ్ళేందుకు ప్రయత్నించిన ఓ ట్రాక్టర్ యజమాని జీవన వైనమే.. ఈ ‘చింతల చేను’.. క్లుప్తంగా గ్రామీణ పరిసరాలు, రైతు జీవితం, ప్రకృతి నేపథ్యంలో సాగే ఈ నవలలో మానవునికి, ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణను రచయిత చక్కగా విశదీకరించారు.
- పి. రాజ్యలక్ష్మి-
