- రాష్ట్రంలో ఓ అవినీతి సర్కార్ కూలితే.. మరో అవినీతి ప్రభుత్వం ఏర్పడింది: నితిన్ నబిన్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్ష లు, స్వప్నాలను తాము సాకారం చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని.. ఇందుకోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద గత పన్నెండ్లలో రూ. 13 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చిందన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ బీజేపీ, తెలంగాణ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ సంయుక్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు నితిన్ నబిన్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పార్టీ రాష్ట్ర సెక్రటరీ(సంస్థాగత) చంద్ర శేఖర్ తివారి, ఎంపీ రఘునందన్ రావు, ఇతర ముఖ్య నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ’ నినాదంతో నితిన్ నబిన్ స్పీచ్ ప్రారంభించారు. ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.‘‘తెలంగాణ తొలి దశ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యమకారులపై ఆ నాటి కాంగ్రెస్ సర్కార్ కాల్పులు జరిపింది. బీజేపీ మాత్రం మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటులో ప్రజలకు అండగా ఉంది. రాష్ట్ర ఏర్పాటు కోసం చిన్నమ్మ సుష్మా స్వరాజ్ పార్లమెంట్ లో గట్టిగా నిలబడ్డారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కాకినాడలోనే తీర్మానం చేశాం. తెలంగాణ ప్రజల ఉద్యమానికి మద్దతునిచ్చాం’’ అని తెలిపారు.
కాంగ్రెస్కు ఆ అర్హత లేదు: కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒకవైపు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి, మరోవైపు మిర్చి పౌడర్లు, పెప్పర్ స్ప్రేలు కొట్టిన ఊసరవెళ్లి రాజకీయాలు కాంగ్రెస్ వని విమర్శించారు. తెలంగాణ కోసం వందలాది మందిని బలితీసుకున్న చరిత్ర ఆ పార్టీదన్నారు. అసలు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ కాదని.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్ర ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. బీజేపీ మాత్రం తెలంగాణ విషయంలో ఎప్పుడూ ఒకే మాట.. ఒకే బాట.. ఒకే నినాదంతో ఉందన్నారు. ఏపీకి వెళ్లి మాజీ మంత్రి రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంటు ఏమైందని బీజేపీ ఎంపీ రఘునందర్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ ది ఎమర్జెన్సీ మైండ్ సెట్: రాంచందర్ రావు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతివ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ మైండ్ సెట్ కు నిదర్శమని రాంచందర్ రావు విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు రాష్ట్రంలో ఎక్కడ సభలు పెట్టుకున్నా ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు. అర్బన్ నక్సలైట్ల సభలకూ పర్మిషన్ వస్తుందన్నారు. కానీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఎందుకు నిరాకరించారో ఎవరికీ తెలియదన్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల మధ్య ద్వేషాలు, విభేదాలు ఉండకూడదు.
అభివృద్ధిలోనే పోటీ ఉండాలి. వికసిత్ తెలంగాణ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లు కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే వికసిత్ భారత్ సాకారమవుతుంది’’ అని అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా జాతీయ సభ్యుడు పెరిక సురేశ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో తొలిసారి బీజేపీ నేతృత్వంలో ఆవిర్బావ వేడుకల్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ వేడుకలు రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటుకు శ్రీకారంగా భావిస్తున్నట్లు చెప్పారు.
