నాడు ఫ్లోరోసిస్ – నేడు పసుపు బోర్డ్ : బ్యాలెట్ వార్

నాడు ఫ్లోరోసిస్ – నేడు పసుపు బోర్డ్ : బ్యాలెట్ వార్

నామినేషన్‌‌.. ఓ నిరసనాస్త్రం

నిజామాబాద్ రైతులు తమ బాధను చెప్పుకొనేందుకు ఎన్నికలను అస్త్రంగా చేసుకున్నారు. పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసి, అందరిదృష్టినీ తమవైపు తిప్పుకొన్నారు. ఈ నిరసనకు స్ఫూర్తి 1996 నల్లగొండ లోక్​సభ ఎన్నిక. ఫ్లోరోసిస్​ కారణంగా కాళ్లు, చేతులు వంకరలు పోయి జీవచ్చవాలుగా బతుకుతున్న నల్గొండ జిల్లా జనం బాధను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు అప్పట్లో పోరుబాట పట్టారు. ఫ్లోరైడ్ నుంచి ప్రజలను రక్షించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ‘జలసాధన సమితి’ వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యం లో ‘బ్యాలెట్’ నిరసనకు దిగారు.

నల్గొండ ఎంపీకి 537 నామినేషన్లు.. నేషనల్ రికార్డ్

నల్గొండ లోక్​సభ స్థానంలో 537 మంది ఆనాడు నామినేషన్లు వేశారు. అందులో 22మంది ఉప వెనక్కి తీసుకోగా, 35 మంది నామినేషన్లు తిరస్కరించారు. ఏకంగా 480 మంది పోటీలో నిలవడంతో ఆ ఎన్నిక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వానికి  సెగ తగిలింది.

నెలరోజులు ఎన్నిక వాయిదా

పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో.. నిర్వహణ కష్టమని ఎన్నికను నెలరోజుల పాటు వాయిదా వేశారు. ఆ సమయంలోగా ఆ 480 మందికి గుర్తులు కేటాయించి, భారీగా బ్యాలెట్​ పేపర్లు ముద్రించి, ఎన్నిక నిర్వహించారు. బ్యాలెట్​ పేపర్ లో 331వ నంబర్‌‌లో ఉన్న సీపీఐ అభ్యర్థి ధర్మభిక్షం గెలుపొందారు. అయితే నల్లగొండ ఫ్లో రోసిస్​ అంశం జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఫోకస్​ అయింది. సర్కారు తాగునీటిసౌకర్యం కల్పించేలా చేసింది.

ఇప్పుడు నిజామాబాద్ జిల్లా రైతులు అదే స్ఫూర్తితో ‘బ్యాలెట్’ పోరుకుదిగారు. మరోవైపు వారణాసి లోక్‌ సభ స్థానంలోప్రధాని మోడీపై పోటీ చేసేం దుకు తమిళనాడుకుచెందిన 111 మంది రైతులు సిద్ధమవుతున్నారు.