49 మంది రెబల్స్ సంతకాలతో గవర్నర్కు లేఖ

49 మంది రెబల్స్ సంతకాలతో గవర్నర్కు లేఖ

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే రాజీనామాతో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.  మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి.  డిప్యూటీ సీఎంగా శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే తొలి విడతగా ఏర్పాటు కాబోయే మంత్రివర్గంలో షిండే వర్గం నుంచి ఎంతమందికి చోటు లభిస్తుంది ? ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారు ? అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై స్పందించిన ఏక్ నాథ్ షిండే.. మంత్రి వర్గం కూర్పునకు సంబంధించి  ఇప్పటివరకైతే బీజేపీతో చర్చలు జరపలేదని గురువారం స్పష్టం చేశారు. త్వరలోనే దానికి సంబంధించిన చర్చలు జరుగుతాయని వెల్లడించారు. మంత్రి వర్గంలో చోటు దక్కబోయే ఎమ్మెల్యేల జాబితాకు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మొద్దని మీడియాకు సూచించారు. శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ థాక్రే నేర్పించిన హిందుత్వ భావజాలంతో ముందుకు సాగుతామని వెల్లడించారు. 

ముంబైలో దిగగానే గవర్నర్తో భేటీ

మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలతో గురువారం ఉదయం గోవాలో సమావేశమైన ఆయన, అనంతరం ముంబైకి బయలుదేరారు. వాణిజ్య రాజధానిలో దిగగానే నేరుగా గవర్నర్ ను కలువనున్నారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందించనున్నారు. ఈ లేఖపై మొత్తం 49 మంది రెబల్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం కూర్పుపై చర్చించే అవకాశం ఉంది.