డిసెంబర్ 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్ కి దేశం నలుమూలల నుంచి అభిమానులు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మ్యాచ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యాచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు సీపీ సుధీర్ బాబు. ఈ మ్యాచ్ కు పాస్ లేకుంటే ఎంట్రీ లేదని స్పష్టం చేశారు.
ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం దగ్గర రద్దీ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ మేరకు అభిమానులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు సుధీర్ బాబు.టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని మిగతా వారికి ఎట్టి పరిస్థితి లో అనుమతి ఉండదని స్పష్టం చేశారు సుధీర్ బాబు. ఈ నెల 13న జరుగుతున్న ఈ మ్యాచ్ కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందో బస్తును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు సుధీర్ బాబు.
ఇదిలా ఉండగా.. డిసెంబర్ 13న సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్ చేరుకుంటాడని ఆయన చీఫ్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి తెలిపారు. టూర్ కు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ఎంతో మంది ప్రజలు మెస్సీ మ్యాచ్ చూసేందుకు వస్తారని తెలిపారు. మెస్సీ రాకతో ఫుట్ బాల్ కు తెలంగాణ రాష్ట్రంలో మరింత ఆదరణ పెరుగుతుందని, క్రీడాకారులు కూడా పెరుగుతారని తెలిపారు.
మెస్సీ షెడ్యూల్:
- డిసెంబర్ 13న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కు మెస్సీ
- హైదరాబాద్ చేరుకున్నాక ఒక హోటల్లో విశ్రాంతి
- సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటాడు
- స్టేడియంలో15 నిమిషాలు రెండు టీములు పోటీ పడతాయి
- మ్యాచ్ చివరి 5 నిమిషాలలో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ టీమ్ తో కలుస్తారు
- మ్యాచ్ తర్వాత చివరగా స్కూల్ పిల్లలతో మెస్సీ ఇంటరాక్షన్ ఉంటుంది.
- తర్వాత పరేడ్ ఉంటుంది, ఆ తర్వాత మెస్సీకి సన్మానం ఉంటుంది.
- ఉప్పల్ స్టేడియంలో మొత్తం గంట 40 నిమిషాల పాటు మెస్సీ గడుపుతారు.
- సౌత్ ఇండియాలోనే పెద్ద ఈవెంట్
- ఉప్పల్ స్టేడియం లో మెస్సీ టూర్ పూర్తయ్యాక అదే రోజు హైద్రాబాద్ నుండి వెళ్ళిపోతారు.

