సీపీఎస్ వద్దంటే నష్టం లేదు!

సీపీఎస్ వద్దంటే నష్టం లేదు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం)ను వద్దనుకుంటే.. ఆర్థికంగా పెద్దగా భారం పడే అవకాశం ఏమీ లేదని తెలిసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సీపీఎస్​ను రద్దు చేసి.. ఆయా రాష్ట్రాల్లో పాత పెన్షన్ స్కీంను అమలు చేస్తున్నాయి. దీంతో మన రాష్ట్రంలోనూ పాత పెన్షన్ స్కీం అమలు చేస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఒక నివేదికను తయారు చేసి త్వరలో ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిసింది. 

ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్(ఎన్​పీఎస్) ట్రస్ట్ విషయంలో పీఠముడి ఉన్నట్లు చెప్పారు. అయితే అలాంటిదేమీ లేదని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌, ఛత్తీ్‌స్ గఢ్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, కర్నాటక రాష్ట్రాలు సీపీఎస్​ను రద్దు చేశాయి. రిటైర్ అయినవాళ్లకు పెన్షన్ కూడా ఇస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం అసలు ఎన్​పీఎస్ ఖాతాకు ఒక్క పైసా కూడా జమ చేయడం లేదు. ఇదే విషయమై ఆర్థిక శాఖ అధికారులు సమగ్ర నివేదికను తయారు చేస్తున్నారు. ఈ రిపోర్ట్ ను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిసింది.  

రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం లేదు  

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులకు చెందిన రూ.16,500 కోట్ల సొమ్ము ఎన్​పీఎస్ ట్రస్టులో ఉన్నది. ఒకవేళ ఎన్​పీఎస్ వద్దనుకుంటే ఆ మొత్తం వెనక్కి వెంటనే ఇస్తారో, ఇవ్వరో అనే అనుమానం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తమౌతోంది. ఈ విషయంలోనే పీఠముడి ఉందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పరోక్షంగా చెప్పారు. అయితే ముందు ఎన్​పీఎస్ ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.400 కోట్ల జమ చేయడం ఆపేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. రిటైర్మెంట్ టైంలోనే పెన్షన్ కు సంబంధించిన ఇష్యూ వస్తుందని.. అప్పుడు ప్రభుత్వానికి నష్టం లేకుండా ఎన్​పీఎస్ నుంచి వచ్చే మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంచుకుని పాత పెన్షన్​ను అమలు చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.  

పాత, కొత్త స్కీంలు ఇలా.. 

పాత పెన్షన్‌ విధానంలో 50 శాతం పెన్షన్‌, కుటుంబ సభ్యులకు 30% పెన్షన్‌, రూ.16 లక్షల గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌ వంటివి ఉండగా, అవి ఇప్పుడున్న సీపీఎస్ లో లేవు. పాత పెన్షన్ విధానంలో రిటైర్మెంట్ టైంలో వచ్చే జీతంలో 50 శాతం మొత్తాన్ని ప్రతి నెలా పెన్షన్‌ కింద చెల్లిస్తారు. ఇప్పుడు సీపీఎస్‌ కింద ఉద్యోగి వేతనం, డీఏల నుంచి 10 శాతం, ప్రభుత్వం నుంచి మరో 10 శాతం సొమ్మును కలిపి ఎన్​పీఎస్ ట్రస్టులో జమ చేస్తున్నారు. దీంట్లో ఉద్యోగి రిటైర్ అయ్యే వరకు జమ అయిన మొత్తం నుంచి 60 శాతం డబ్బును మాత్రమే ఉద్యోగికి చెల్లిస్తారు. మిగతా 40 శాతం డబ్బును షేర్‌ మార్కెట్‌లో పెడుతున్నారు. వచ్చే లాభాన్ని నెలవారి పెన్షన్‌ కింద రిటైర్డు ఉద్యోగికి చెల్లిస్తున్నారు. దీంతో రూ.వెయ్యి, రూ. రెండు వేలు మాత్రమే పెన్షన్ తీసుకుంటున్న ఉద్యోగులూ ఉన్నారని చెప్తున్నారు.

రాష్ట్రాలు రద్దు చేసుకోవచ్చు  

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లో 2 లక్షల మందికి పైగా సీపీఎస్ విధానంలో ఉన్నారు. కొత్తగా ప్రభుత్వంలో చేరే ఉద్యోగులందరూ కంట్రిబ్యూటరీ పెన్షన్​లోనే ఉంటారు. ఇటీవల చేపట్టిన కొత్త రిక్రూట్మెంట్​తో పాటు ఆర్టీసీ, రెవెన్యూలో కొందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. సంబంధిత జీవోలు వస్తే వాళ్లు కూడా సీపీఎస్ ఉద్యోగుల కిందకే వస్తారు. ఇలా 3 లక్షల మంది దాకా ఉద్యోగులు సీపీఎస్​లోకి వస్తారు. అయితే, సీపీఎస్​ను రద్దు చేసుకునే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్ మెంట్‌ అథారిటీ(పీఎఫ్​ఆర్‌డీఏ) చట్టం కల్పిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు.