పైసల్లేవు.. ట్యాక్సులెట్టా కట్టాలంటున్నపల్లె జనాలు

పైసల్లేవు.. ట్యాక్సులెట్టా కట్టాలంటున్నపల్లె జనాలు

సర్వేతో అన్నింటికీ లింక్​..

అన్ని బిల్లులు క్లియర్​  చేస్తేనే ఆస్తుల వివరాలు నమోదు

ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంకా తేరుకోని జనాలు

పైసలు లేని వేళ ట్యాక్స్​ అంటే ఎట్లా అంటున్న పల్లెజనాలు

వరంగల్​, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన నాన్​ అగ్రికల్చర్​ ప్రాపర్టీ సర్వే  ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. నిన్నమొన్నటి వరకు లాక్​ డౌన్​తో ఉపాధి కోల్పోయి ఉన్న ప్రజలను ఇంటి, నల్లా పన్నులు  కట్టాలని గ్రామపంచాయతీల ఆఫీసర్లు బలవంతం చేస్తున్నారు. లేదంటే ప్రాపర్టీ సర్వే వివరాలు ఆన్​లైన్​లో ఎంటర్​ చేయమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్ల వివరాలు నమోదు చేయడానికి రెండు, మూడు వేలు వసూలు చేస్తుంటే ఇప్పుడు ట్యాక్స్​ వెంటనే కట్టాలని చెబుతుండడంతో జనాలు ఆర్థికంగా మరింత ఇబ్బంది పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో అప్పులు తెచ్చి మరీ పన్నులు కడుతున్నారు. పన్ను  కడితేనే ప్రాపర్టీ వివరాలు నమోదు చేయాలని సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకున్నా లక్ష్యం చేరుకోవాలనే ఉద్దేశంతో కిందిస్థాయి ఆఫీసర్లు, పంచాయతీ సిబ్బంది జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

బిల్లు కడితేనే వివరాల నమోదు

​ అర్బన్​ జిల్లాలో 130 పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఇండ్లు, నల్లాలు, లైబ్రరీ తదితరాలకు సంబంధించిన రూ.5.26కోట్ల పన్ను వసూలు డిమాండ్​ ఉంది. మొదటి నుంచి పన్ను చెల్లింపుపై అవగాహన కల్పించకపోవడం.. ఆ తర్వాత కరోనా వైరస్​ వ్యాప్తి, లాక్​ డౌన్ తో బిల్లులు పెండింగ్​లో పడిపోయాయి. మొత్తంగా 47 శాతం అంటే రూ.2.45కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. అవి కూడా పేద కుటుంబాలకు చెందినవారివే. ఇప్పుడు సర్వేతో పాటు పనిలోపనిగా పన్ను వసూలు లక్ష్యంపై దృష్టి పెట్టిన పంచాయతీ ఆర్థిక ఇబ్బందులున్నా పన్ను కచ్చితంగా చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. దీంతో ఆస్తుల నమోదు విషయంలో మరెలాంటి ఇబ్బందులు వస్తాయోనని జనాలు అప్పుల కోసం తిరుగుతున్నారు.

గ్రామాల్లో డప్పు చాటింపు

పెండింగ్​లో ఉన్న బిల్లులన్నీ కడితేనే ధరణి పోర్టల్​లో నమోదు చేస్తామని కొన్ని గ్రామాల్లో డప్పు చాటింపు వేస్తున్నారు. దీంతో ఇప్పటికే చేతిలో చిల్లిగవ్వ లేక ​ ఇబ్బందులు పడుతుండడం.. ఆన్​లైన్​లో వివరాల నమోదుకు ట్యాక్స్​ క్లియర్ చేయాల్సిందేనని కరాకండీగా చెబుతుండడంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోందంటూ సర్వే, ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో లీడర్లు, పెద్దాఫీసర్లు తగిన చర్యలు తీసుకొని పన్నులకు సర్వేకు సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని
ప్రజలు కోరుతున్నారు.

పైసలు లేని యాళ్ల పన్నులంటే ఎట్ల?

అసలే పైసలు లేక అరిగోస పడుతుంటే ఆస్తుల సర్వే అని చెప్పి పన్ను కట్టమంటున్నారు. అసలే కూలి దొరుకుతలేదు. ఎప్పుడో ఓసారి కూలికి పోతే వచ్చిన పైసలు కూడుకే సాల్తలేవు. దీంట్ల పన్నులు కట్టమంటే పింఛన్ పైసలు తెచ్చి కట్టాల్సి వస్తాంది. – పిల్లల వినోద, గూడూర్

బదులు తెచ్చి కడుతున్నా..

మా ఊర్ల ఇదేదో సర్వే అని డప్పు చాటింపు చేసిన్రు.. ఇంటి, నల్ల పన్నులు కడితేనే సర్వే చేస్తమని చెప్పిన్రు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో వేరుటోళ్ల దగ్గర బదలు తెచ్చి పన్ను కడుతున్న. వచ్చే నెల పింఛన్ వచ్చినంక వాళ్ల డబ్బులు వాళ్లకు ఇస్తనని చెప్పిన.-మాడిశెట్టి రాజమ్మ, గూడూరు