ఇక నన్నెవరూ ఆపలేరు

ఇక నన్నెవరూ ఆపలేరు

జనవరి 20న సర్కారు ఏర్పాటు చేస్తం: జో బైడెన్

ఆ రోజున ట్రంప్ దిగిపోక తప్పదు

ఆయన తీరు చికాకు తెప్పిస్తోందని కామెంట్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓటమిని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోకపోవడం బాలేదని, ఆయన తీరు చికాకు తెప్పిస్తోందని ఎన్నికల్లో విజేతగా నిలిచిన డెమొక్రటిక్ నేత జో బైడెన్ అన్నారు. ఇది ప్రెసిడెంట్ పదవి వారసత్వానికి మంచిది కాదన్నారు. ఓటమిని ట్రంప్ ఒప్పుకోకున్నా.. తాను గద్దెనెక్కకుండా ఎవరూ ఆపలేరని ఆయన మంగళవారం విల్మింగ్టన్ లో మీడియాకు  స్పష్టం చేశారు.  పదవీకాలం ముగిశాక.. జనవరి 20న ఎవరైనా ప్రెసిడెంట్ కుర్చీ దిగక తప్పదని, ట్రంప్ ఒప్పుకోకున్నా అది జరిగి తీరుతుందన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకోకపోయినా.. తమ ప్లాన్ లో ఎలాంటి మార్పు ఉండబోదని, తాము చేయాల్సింది చేయగలమని చెప్పారు. జనవరి 20న అన్నీ ఫలిస్తాయన్నారు. ఆ రోజున.. ఇప్పటికి, అప్పటికి మధ్య పవర్ ట్రాన్సిషన్ జరిగిందని అమెరికన్ ప్రజలకు తెలియాలన్నారు. ట్రంప్ కు ఓటేసినోళ్లు, తనకు ఓటేసినోళ్లంతా ఆ రోజున ఒక్కటవుతారని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల అధినేతలతో కూడా తాను మాట్లాడుతున్నట్లు బైడెన్ చెప్పారు. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రన్, జర్మన్ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ తనతో ఫోన్​లో మాట్లాడి, గ్రీటింగ్స్ చెప్పారని వెల్లడించారు.

సర్కార్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నం..

అధికార మార్పిడి ప్రక్రియను ఇప్పటికే స్టార్ట్ చేశామని బైడెన్ చెప్పారు. వైట్​హౌస్​లో తమ అడ్మినిస్ట్రేషన్​పై ఫోకస్ పెట్టామని, కేబినెట్ మంత్రులుగా ఎవరిని తీసుకోవాలన్న దానిపైనా రివ్యూ జరుగుతోందని చెప్పారు. కొత్త ప్రెసిడెంట్​కు అధికార మార్పిడి ప్రక్రియ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జీఎస్ఏ) ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుంది. ట్రంప్ నియమించిన జీఎస్ఏ అడ్మినిస్ట్రేటర్ ఎమిలీ మర్ఫీ.. అధికార మార్పిడి ప్రాసెస్​ను స్టార్ట్ చేసేందుకు చర్యలు తీసుకోలేదు. దీంతో అధికార మార్పిడి ప్రక్రియకోసం కాంగ్రెస్ కేటాయించిన 63 లక్షల డాలర్ల ఫండ్స్​ను బైడెన్ టీం వాడుకునే వీల్లేకుండా పోయింది. ఫెడరల్ ఏజెన్సీలను అధీనంలోకి తీసుకునేందుకు, ప్రెసిడెంట్ డైలీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్​ను పొందడానికీ అవకాశం లేకపోయింది. అయినా అధికార మార్పిడిని వెంటనే స్టార్ట్ చేసేలా కోర్టుకెళ్లాల్సిన అవసరం కూడా లేదని బైడెన్ చెప్పారు.

ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలు వెంటనే రద్దు?  

అమెరికా ప్రెసిడెంట్​గా బైడెన్ పగ్గాలు చేపట్టిన వెంటనే ట్రంప్ సర్కార్ తెచ్చిన ఇమిగ్రేషన్ పాలసీలను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇమిగ్రెంట్లను అడ్డుకునేందుకు మెక్సికో బార్డర్​లో కడుతున్న గోడను ఆపడం, అమెరికాలోకి చిన్నతనంలోనే అక్రమంగా వచ్చిన లేదా తీసుకొచ్చిన 6.5 లక్షల మందికి రక్షణ కల్పించడం, 13 ముస్లిం దేశాల వారు అమెరికాలోకి రాకుండా ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయడంవంటి చర్యలను బైడెన్ సర్కార్ తీసుకోనుంది.

మేమే గెలిచినం: కమలా హారిస్ 

ప్రెసిడెంట్ ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలిచామని, బైడెన్ అమెరికా హిస్టరీలోనే అత్యధిక ఓట్లతో చరిత్రాత్మక విజయం సాధించారని వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ కమలా హారిస్ అన్నారు. బైడెన్ కు పడిన ప్రతి ఓటూ.. ‘ఆరోగ్య సేవలు పొందడం ఒక హక్కు’ అన్న స్టేట్ మెంట్ వంటిదని ఆమె చెప్పారు. ఏడున్నర కోట్ల మంది తమకు ఓటేశారని, వాళ్ల కోరికను కూలదోసే ప్రయత్నాన్ని ముందుకు సాగనివ్వబోమన్నారు.