LIC, EPFOలో క్లెయిమ్ చేయని డబ్బుపై కేంద్రం కీలక ప్రకటన.. ఆ సొమ్మును ఏం చేస్తున్నారంటే..?

LIC, EPFOలో క్లెయిమ్ చేయని డబ్బుపై కేంద్రం కీలక ప్రకటన.. ఆ సొమ్మును ఏం చేస్తున్నారంటే..?

ప్రభుత్వ ఇన్సూరెన్స్ దిగ్గజం LIC, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFOలో క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన వేల కోట్ల రూపాయలపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. ఈ నిధులను ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ఈ మొత్తాలు అసలు హక్కుదారులు లేదా వారి నామినీలకే అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఎల్‌ఐసీలో 10 సంవత్సరాలకు పైగా ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బు మొత్తాలను ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ (SCWF)కు బదిలీ చేస్తారని మంత్రి వివరించారు. అయితే ఆ నిధులను వేరే అవసరాలకు మళ్లించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎల్‌ఐసీలో మొత్తం రూ.7వేల 318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ నిధులు ఉన్నాయని తెలిపారు. ఇందులో రూ.5వేల 564 కోట్లు పాలసీదారులకు చెందిన అసలు మొత్తం కాగా.. రూ.వెయ్యి 754 కోట్లు ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ అని వెల్లడించారు.

ఇక ఈపీఎఫ్‌వోలో క్లెయిమ్ చేయని నిధుల మొత్తం రూ.9వేల 330 కోట్లుగా ఉందని కేంద్రం తెలిపింది. ఈ మొత్తాలను నిజమైన లబ్ధిదారులకు చేర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ముఖ్యంగా రూ.1,000 లేదా అంతకంటే తక్కువ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్న ఆధార్ ధృవీకరించిన ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేసే పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం అదనపు డాక్యుమెంట్ల అవసరం లేకుండా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.

అన్‌క్లెయిమ్డ్ నిధులు హక్కుదారులకు చేరేలా ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌వో విస్తృత స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘నిధి ఆప్‌కే నికత్’ శిబిరాలు, సోషల్ మీడియా, అధికారిక వెబ్‌సైట్, పోస్టల్ కమ్యూనికేషన్, స్థానిక ఏజెంట్లు, బీమా సఖిలు, క్రెడిట్ బ్యూరో ప్రతినిధుల ద్వారా పాలసీదారులు, నామినీలను గుర్తించి క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేయించే చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.