హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ రాకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. నిబంధనలు, సాంకేతిక కారణాలతోనే అనుమతి నిరాకరించారని, దీనిపై కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేయడం సరికాదని సూచించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు విదేశాలకు వెళ్లేటప్పుడు.. పర్యటన ఆవశ్యకత, భద్రత, అంతర్జాతీయ ప్రోటోకాల్‌ను విదేశాంగ శాఖ పరిశీలిస్తుందని వివరించారు. 2012లో యూపీఏ హయాంలో అస్సాం సీఎం తరుణ్ గొగొయ్ పర్యటనను కేంద్రం తిరస్కరించిన విషయం కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. నాడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీకి వీసా రాకుండా కుట్రలు చేసింది కాంగ్రెస్ నేతలే కదా అని విమర్శించారు.
మెడికల్ ఫీజుల రీఫండ్‌పై పోరాడ్తం
ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అదనంగా వసూలు చేసిన ఫీజులను విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. నాలుగున్నర ఏండ్ల కోర్సు కోసం 5 విడతల్లో ఫీజు వసూలు చేస్తూ ఒక్కో విద్యార్థిపై రూ.13 లక్షల నుంచి రూ.20 లక్షలదాకా అదనపు భారం మోపడం దారుణమన్నారు. హైకోర్టు, టీఏఎఫ్ఆర్సీ చెప్పినా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే బీజేపీ పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాగా, తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ నేతృత్వంలో ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ విజయేందర్, మేఘనా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రమోద్‌లు రాంచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు.
