పెట్రోల్‌‌‌‌,డీజిల్ సాల్తలేదు

పెట్రోల్‌‌‌‌,డీజిల్ సాల్తలేదు
  • రాష్ట్రంలో 20% బంకుల్లో "నో స్టాక్" బోర్డులు
  • నష్టాలతో సరఫరాను తగ్గించిన ఆయిల్‌‌ కంపెనీలు
  • డిపాజిట్‌‌ చేస్తేనే స్టాక్‌‌ ఇస్తామనడంతో తక్కువ తెప్పిస్తున్న డీలర్లు
  • ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. హైదరాబాద్‌‌తోపాటు జిల్లాల్లోని చాలా బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వివిధ ఆయిల్‌‌ కంపెనీల నుంచి రాష్ట్రంలోని బంక్‌‌లకు రోజూ సుమారు కోటి లీటర్ల డీజిల్‌‌, 40 లక్షల లీటర్ల పెట్రోల్‌‌ సరఫరా అవుతుంటుంది. ప్రస్తుతం ఇందులో 50 శాతం మాత్రమే ఆయిల్‌‌ కంపెనీలు ట్రాన్స్‌‌పోర్ట్‌‌ చేస్తున్నాయి. ఇందులో బీపీసీఎల్‌‌ కంపెనీ అత్యధికంగా ఆపేసినట్లు డీలర్లు చెప్తున్నారు. తర్వాత స్థానాల్లో హెచ్‌‌పీ, ఐవోసీ కంపెనీలు ఉన్నాయని పేర్కొంటున్నారు. బంకులకు వచ్చిన పెట్రోల్, డీజిల్​ కొన్ని గంటల్లోనే ఖాళీ అవుతున్నది. దీంతో బంక్‌‌ నిర్వాహకులు ‘నో స్టాక్‌‌’ బోర్డులు పెడుతున్నారు. ఇట్ల రాష్ట్రంలో 20 నుంచి 30 శాతం బంకుల్లో ‘నో స్టాక్’​ బోర్డులు కనిపిస్తున్నాయి. కారణాలేంటి? పెట్రో కొరతకు డీలర్లు, ఆయిల్‌‌ కంపెనీలు పలు కారణాలు చెప్తున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్​పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌‌ సుంకం తగ్గించింది. 

ఇంటర్నేషనల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కంటే సుమారు లీటర్​ డీజిల్‌‌‌‌పై రూ. 25, లీటర్​ పెట్రోల్‌‌‌‌పై రూ.8 వరకు తక్కువగా తాము డీలర్లకు సరఫరా చేయాల్సి వస్తున్నదని, దీంతో తమకు నష్టం వస్తున్నదని ఆయిల్‌‌‌‌ కంపెనీలు అంటున్నాయి. నష్టాల కారణంగా కంపెనీలు తక్కువ మాల్​ను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో స్టాక్​ తెప్పించుకొని, ప్రాఫిట్‌‌‌‌ వచ్చాక డీలర్లు డబ్బులు చెల్లించేవారు. కానీ ఇప్పుడు రెండు రోజుల ముందే క్రెడిట్‌‌‌‌ చేయాలని ఆయిల్‌‌‌‌ కంపెనీలు చెప్తున్నాయి. దీంతో అనేక మంది డీలర్లు పెద్ద మొత్తంలో ముందు చెల్లించకలేక కొద్దికొద్దిగా స్టాక్​ తెప్పించుకుంటున్నారు. 
 
ఇబ్బందుల్లో వాహనదారులు..
పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం వేళల్లో అధికంగా ‘నో స్టాక్‌‌‌‌’ బోర్డులు కనిపిస్తున్నాయి. డిపోల నుంచి స్టాక్‌‌‌‌ వచ్చాక.. అంటే, మధ్యాహ్నం వరకు గానీ పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ దొరకడంలేదు. వచ్చిన కొన్ని గంటల్లోనే ఆ స్టాక్‌‌‌‌ కూడా అయిపోతున్నది. ఇక జిల్లాల్లో ఈ పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంది. అక్కడ రెండు, మూడు, రోజులకోసారి మాత్రమే స్టాక్‌‌‌‌  వెళ్తుంటుంది. దీంతో ఉదయం డ్యూటీలకు సొంత వాహనాలపై వెళ్లేవాళ్లు, క్యాబ్‌‌‌‌ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తిప్పలు పడుతున్నారు.  

బంక్‌‌‌‌లను మూసుకుంటున్నరు..
రాష్ట్రంలో బంక్‌‌‌‌ల నిర్వహణ భారంగా మారిందని డీలర్లు అంటున్నారు. కరోనా టైంలో మూడు నెలలపాటు ఉత్తగనే బంకులను తెరిచామని, అయినా అన్ని ట్యాక్స్‌‌‌‌లు, ఫీజులు చెల్లించామని, సర్కారు మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని చెప్తున్నారు. కరోనా టైం నుంచి బంకులకు టూర్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ట్రావెల్స్‌‌‌‌ యజమానులు బకాయిలు కట్టలేదు. డబ్బులు చెల్లించాల్సిన అనేక ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని బంకుల నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు స్టాక్‌‌‌‌ సప్లయ్​ తగ్గడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. గతంలో ఒక్కో బంకులో రోజుకు 2 వేల  లీటర్లు అమ్మగా.. ఇప్పుడు వెయ్యి లీటర్లే అమ్ముతున్నారు. దీంతో కమీషన్ తగ్గిపోయింది. ఐదేండ్ల నుంచి డీలర్‌‌‌‌ మార్జిన్‌‌‌‌ పెరగలేదని, డీజిల్‌‌‌‌పై అన్ని రకాల ఖర్చులు పోగా లీటర్‌‌‌‌పై రూపాయి కూడా మిగలడంలేదని నిర్వాహకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంకులను మూసేస్తున్నారు. 

క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇవ్వాలి..
బకాయిలు పూర్తిగా చెల్లించడంతో పాటు కొత్తగా స్టాక్ కోసం ముందుగా డిపాజిట్ చేస్తేనే సప్లయ్​ చేస్తామని ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు అంటున్నాయి. ఇప్పటికే బకాయి పడిన డబ్బులో రూ. 50 లక్ష వరకు చెల్లించాం. ఇంకా కొంత కట్టాల్సి ఉంది. ఎక్కడైనా డబ్బులు అడుగుదామంటే మార్కెట్ చాలా టైట్ గా ఉంది. చిన్న బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు క్రెడిట్ ఇస్తే కొంత వెసులుబాటు ఉంటుంది.
-వెంకట్ చౌహాన్, బంక్ నిర్వాహకుడు, బొడుప్పల్

ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయ్యాలే..
ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ఇష్టమున్నట్లు సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచాలని, తగ్గించాలని అంటున్నాయి. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాక మరింత ఇబ్బందులు పడుతున్నాం. ఐదేండ్ల నుంచి కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచడంలేదు. బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడిచినా, నడవకపోయినా మినిమం గ్యారెంటీ ఇవ్వాలి. కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గించైనా కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్క ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు చేయాలి.
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-రాజీవ్ అమరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టినంత సప్లయ్​ చేస్తలేరు
ఆయిల్​ కంపెనీలు ముందుగా డిపాజిట్ చేసిన వారికి మాత్రమే సప్లయ్​ చేస్తున్నాయి. అది కూడా ఇండెంట్ పెట్టినంత సప్లయ్​ చేయడంలేదు. దీంతో పెట్రో పంపుల్లో స్టాక్ ఉండటం లేదు.- శ్రీనివాస్ రెడ్డి, బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్, హైదరాబాద్‌‌‌‌