వీడియో: ఆర్మీకి లొంగిపోయిన టెర్రరిస్ట్

వీడియో: ఆర్మీకి లొంగిపోయిన టెర్రరిస్ట్

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌లో ఆర్మీ చేపట్టిన జాయింట్ యాంటీ టెర్రరిజం ఆపరేషన్‌‌లో ఓ టెర్రరిస్ట్ లొంగిపోయాడు. ఈ వీడియోను ఆర్మీ శుక్రవారం విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితమే టెర్రరిజంలో చేరిన సదరు ఉగ్రవాది వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్‌‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆర్మీ విడుదల చేసిన ఆ వీడియోలో సదరు టెర్రరిస్టు సేఫ్టీ జాకెట్ ధరించి కనిపించాడు. నీకేమీ కాదు, ఎవరూ కాల్పులకు దిగరని జవాన్ హామీ ఇవ్వడంతో టెర్రరిస్టు తుపాకీని పక్కనబెట్టి.. చేతులు పైకెత్తి మెళ్లిగా జవాన్ల వద్దకు చేరుకొన్నాడు. లొంగిపోయిన వెంటనే సైనికులు అతడికి తాగడానికి నీళ్లు ఇచ్చారు. ఆర్మీ రిలీజ్ చేసిన మరో వీడియోలో తన కొడుకును కాపాడినందుకు సదరు టెర్రరిస్టు తండ్రి భద్రతా దళాలకు థ్యాంక్స్ చెప్పాడు. లొంగిపోయిన టెర్రరిస్టును జహంగీర్ భట్‌‌గా గుర్తించారు.

‘అక్టోబర్ 13న ఒక ఎస్‌పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) మరణించారు. అలాగే ఆయన వద్ద ఉన్న రెండు ఏకే -47 (రైఫిల్స్) కనిపించకుండా పోయాయి. అదే రోజు చాదూరాకు చెందిన జహంగీర్‌ భట్ కూడా తప్పిపోయాడు. అతడి కోసం ఫ్యామిలీ గాలిస్తోంది. ఈ రోజు ఉదయం జరిపిన జాయింట్ ఆపరేషన్‌‌లో అతడిని గుర్తించాం. ఇండియన్ ఆర్మీ సదరు వ్యక్తిని లొంగిపోయేలా ఒప్పించే యత్నం చేసింది. ఆ ప్రాంతంలో జహంగీర్ తండ్రి కూడా ఉన్నాడు. ఆర్మీతోపాటు అతడి తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి’ అని ఆర్మీ ఓ ప్రకటనలో వెల్లడించింది.