ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు : నోడల్ ఆఫీసర్ దివ్య

ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు : నోడల్ ఆఫీసర్ దివ్య

పంజాగుట్ట, వెలుగు: ప్రజాభవన్ లో జరిగే ప్రజావాణికి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి.. వాటి స్టాటస్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఆయా శాఖల వద్ద ఉండాలని నోడల్ ఆఫీసర్ దివ్య అధికారులను ఆదేశించారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రజావాణికి వచ్చే వారు సంతృప్తితో వెళ్లాలని..  ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దని అధికారులకు సూచించారు.

వచ్చే వారం నుంచి మరో 10 విభాగాలకు చెందిన అధికారులతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. శుక్రవారం బేగంపేటలోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్​లో నిర్వహించిన ప్రజావాణికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు.

నోడల్ ఆఫీసర్ దివ్య మాట్లాడుతూ.. ప్రజావాణికి శుక్రవారం 1,757 ఫిర్యాదులు అందాయన్నారు. భూ సమస్యలు, ఇండ్లు కావాలని, వైద్య సదుపాయం కల్పించాలని, నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న టెక్నిషియన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. ఇలా పలు ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె తెలిపారు. సైఫాబాద్​కు చెందిన వి. దివ్యశ్రీ(33)కి ఉస్మానియా ఆస్పత్రిలో 2017లో లివర్​మార్పిడి జరిగింది. ఆమె బతికున్నంత కాలం మందులు వాడాలి. నెలకు 12 వేలు అవుతోందని చెప్పడంతో అందుకు చలించిన నోడల్​అధికారి ఆమెకు జీవితాంతం మందులు ఉచితంగా ఇవ్వాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఖాళీగా ఉన్న క్వార్టర్ ఇప్పించాలి 

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తన కార్యకలాపాల నిర్వహణకు సింగరేణి సంస్థకు చెందిన ఖాళీ క్వార్టర్ ను ఇప్పించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య శుక్రవారం ప్రజావాణిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేశారు.